మూడేళ్ల కిందటి రక్షణ శాఖ నోట్ ను ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించడంతో రాఫెల్ డీల్ నేడు కొత్త మలుపు తిరిగింది. ‘రాఫెల్ డీల్ విషయమై రక్షణ శాఖ ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతుండగానే.. ఫ్రాన్స్ అధికారులతో ప్రధాని కార్యాలయం సంప్రదింపులు జరిపింది. ఇలా చేయడం పట్ల రక్షణ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింద’నేది ఆ వార్త సారాంశం. ఈ కథనంపై రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఒప్పందానికి సంబంధించి పీఎంవో కార్యాలయం నుంచి సమాంతర సంప్రదింపులు జరిగాయనడం సరికాదని ఆమె లోక్‌సభలో తెలిపారు. ఒకేసారి రక్షణ శాఖ, పీఎంవో ఆఫీస్ ఫ్రాన్స్‌తో చర్చలు జరపడం వల్ల చర్చలకు విఘాతం కలుగుతోందని నాటి రక్షణ కార్యదర్శి మోహన్ కుమార్ ఈ నోట్‌లో పేర్కొన్నారు. భారత సంప్రదింపుల బృందంలో భాగం కాని పీఎంవో అధికారులను ఫ్రాన్స్ అధికారులతో సమాంతర చర్చలు జరపకుండా చూడాలని రక్షణ శాఖ నోట్‌లో పేర్కొన్నారు. ఈ నోట్‌తో అందరి దృష్టి నాటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ వైపు మళ్లింది. రక్షణ శాఖ సంప్రదింపుల వల్ల వచ్చే ఫలితం పట్ల పీఎంవోకు నమ్మకం లేకపోతే తర్వాత వారే చర్చలు జరపొచ్చని ఆ నోట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ నోట్ పట్ల మనోహర్ పారికర్ అప్పుడే స్పందించారని నిర్మలా సీతారామన్ లోక్‌సభకు తెలిపారు. అధికారులు ఏం మాట్లాడొద్దని పారికర్ సూచించారని ఆమె పేర్కొన్నారు.