Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆడపిల్లల్ని వేధించేవారిని, వారిపై అత్యాచారాలకు పాల్పడే వారిని బహిరంగంగా శిక్షించాలని, అప్పుడే అందరిలో భయం కలుగుతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆడపిల్లల జోలికివెళ్లేవారికి సింగపూర్ తరహాలో శిక్షలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో జనసేన మహిళావిభాగం ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులుతో మాట్లాడుతూ పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య తన హృదయాన్ని ద్రవింపచేసిందని పవన్ ఆవేదన వ్యక్తంచేశారు. మనదేశంలో కథువా ఘటనే మొదటిదికాదని, ఏదైనా దారుణం జరిగితే కానీ, మన వ్యవస్థలో చలనం రావడం లేదని చెప్పారు. ఢిల్లీలో అత్యాచార ఘటన జరిగిన తరువాతే నిర్భయ చట్టం వచ్చిందని, తమ కళ్లముందు జరిగితేనే ఎంపీలు స్పందిస్తారా… అని పవన్ ప్రశ్నించారు.
ఆడపిల్లల్ని వేధించే ఈవ్ టీజర్లు, అత్యాచారానికి ఒడిగట్టేవాళ్లని బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సినిమాల ప్రభావంతో మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగాయి అంటుంటారని, కథువాలో చిన్నారిపై అత్యాచారం, హత్యకి సినిమాలు, కళలు ప్రేరేపించాయా అని పవన్ నిలదీశారు. మనిషిలోని పశువాంఛతో జరుగుతున్న ఘటనలు ఇవన్ని, పశువుకైనా ప్రకృతి నియయం ఉంటుందేమో గానీ, మానవ మృగాలకు ఏమీ ఉండడం లేదని పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే వేధింపుల నుంచి రక్షించుకోవడం ఎంత కష్టమో ఓ తమ్ముడిగా, అన్నగా తనకు తెలుసని పవన్ వ్యాఖ్యానించారు. ఆడపిల్లలు బయటకు వెళ్తే తిరిగి వచ్చే వరకూ ఇంట్లో కన్నవాళ్లు భయపడుతూ ఉండే పరిస్థితులు వచ్చాయని పవన్ ఆవేదన చెందారు.
ఈ సందర్భంగా ఓ సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎదురయిన అనుభవాన్ని పవన్ వెల్లడించారు. కొన్నాళ్ల కిందట తాము ఓ షూటింగ్ కు వెళ్తామని, అక్కడ 200 మంది యూనిట్ సభ్యులు ఉండగానే కొంతమంది బయటివాళ్లు వచ్చి… సినిమాకు సంబంధించిన ఆడపిల్లల్ని వేధించారని, వాళ్ల నుంచి కాపాడేందుకు తాను కర్ర పట్టుకోవాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. అమ్మాయిలను రక్షించుకునేందుకు కఠినమైన చట్టాలుండాలని డిమాండ్ చేశారు. చట్టం బలహీనుల విషయంలో బలంగా, బలవంతుల విషయంలో బలహీనంగా పనిచేస్తోందని, ఈ విధానంలో మార్పు వచ్చేలా పోరాడతామని చెప్పారు. ప్రసారమాధ్యమాలు ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నప్పుడు సంచలనాత్మకంగా కాకుండా సామాజిక చైతన్యం కల్పించేలా కథనాలు ప్రసారం చేయాలని పవన్ కోరారు. అంతకుముందు కథువా దారుణాన్ని ఖండిస్తూ నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పవన్ మౌన ప్రదర్శన నిర్వహించారు.