Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ, టీడీపీ న్యాయంచేస్తాయన్న నమ్మకం తనకు పోయిందని, ఇంతకాలం చేయనివాళ్లు, ఇప్పుడు చేస్తారంటే నమ్మకమేంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని జనసేన కార్యాలయంలో సీపీఎం, సీపీఐ నాయకులతో మూడుగంటల పాటు సుదీర్ఘంగా జరిగిన భేటీ అనంతరం మీడియతో మాట్లాడిన పవన్ జనసేన భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఏపీ ప్రభుత్వానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖపై తాను స్పందించాల్సిన అవసరం లేదని, అమిత్ షా కేవలం ఒక పార్టీ అధ్యక్షుడు మాత్రమేనని, ఆయన భారత ప్రభుత్వ ప్రతినిధి కాదని పవన్ వ్యాఖ్యానించారు. నాలుగేళ్లగా టీడీపీ ప్రతి విషయంలో రాజీ ధోరణి కనబర్చి, ప్రజలను తీవ్రంగా నష్టపరిచిందని పవన్ ఆరోపించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, రాష్ట్రంలో సరైన విద్యావిధానం లేదని, రైతులకు గిట్టుబాటు ధర లేదని, సరైన వైద్యం లేదని పవన్ విమర్శించారు. మౌలికవసతులు కల్పించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదని, నిధుల కొరత ఉన్నప్పుడు వేల కోట్లు పుష్కరాలపై ఎందుకు ఖర్చుపెట్టారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్రలో పసిబిడ్డలు చనిపోతుంటే పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం టీడీపీ అనుబంధ వ్యక్తులదిగా తయారవుతోందని, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుంచి అమరావతిలో స్థిరపడదామనుకునేవారికి ఎలాంటి వసతులు కల్పిస్తారని, 33 వేల ఎకరాల్లో ఒక్కో జిల్లాకు ఇంత భూమి కేటాయించామని ఏమన్నా మార్క్ చేశారా అని పవన్ ప్రశ్నించారు. ప్రతివిషయంలో టీడీపీ వైపల్యం కనపడుతోందని, టీడీపీ, బీజేపీ హోదా, ప్యాకేజీపై అనేకసార్లు మాటమార్చాయని, ఇన్నిసార్లు మాట మార్చిన వాళ్లు, ఇంతకాలం నిలబడలేని వాళ్లు ప్రజలకు న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు అస్సలు లేదని పవన్ వ్యాఖ్యానించారు. జనసేన కచ్చితంగా మాట్లాడుతుందని, అంతేకానీ, ఒకరికి భయపడి, మరొకరికి బెదిరి వెనక్కి తగ్గదని పవన్ స్పష్టంచేశారు.