పాపం చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీతో చేతులు కాల్చుకొని ఆపై దాన్ని కాంగ్రెస్‌లో కలిపి.. ఎట్టకేలకు రాజకీయాల నుంచి వైదొలిగి.. తిరిగి తన సొంతగూడు సినీ పరిశ్రమకు చేరుకున్నాడు. చిరు తన స్వల్పకాలిక రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చేదు అనుభవాల్లో పాలకొల్లులో తనకు ఎదురైన ఓటమి ఒకటి. తాను పుట్టిన పాలకొల్లు నుంచి 2009లో రాజకీయ అరంగేట్రంలోనే పోటీ చేసి ఆయన పరాజయం చవిచూశాడు. పవన్, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా చిరంజీవికి ఇది మాత్రం ఇబ్బందికరంగా మారుతోంది. మర్చిపోతున్న పాత అవమానాన్ని ఆయనకు మళ్లీ గుర్తుచేస్తున్నట్లవుతోంది. మరోవైపు, పవనే ఈ పరిస్థితికి కారణమంటూ కొందరు చిరు అభిమానులు గుర్రుగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అదే ఎన్నికల్లో తిరుపతి నుంచి గెలుపొందడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అసెంబ్లీలో అడుగుపెట్టగలిగాడు. అయినా పాలకొల్లు ఓటమి ఆయనకు అవమానమే. సొంత నియోజకవర్గంలోనే నెగ్గలేకపోవడం అప్పట్లో ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందని కూడా పలువురు చెబుతుంటారు. ప్రశాంతంగా సినిమాలపై మనసు పెడుతున్నాడు. ఇప్పుడిప్పుడే గత చేదు అనుభవాల నుంచి కోలుకుంటున్న చిరుకు తన తమ్ముడు, జనసేన అధినేత వ్యవహరిస్తున్న తీరు కాస్త ఆందోళనకరంగా మారుతోంది. గతం తాలూకు గాయాలను ఆయనకు పవన్ తిరిగి గుర్తుచేస్తున్నట్లవుతోంది.
పవన్ కల్యాణ్ తన అన్నయ్యకు పాలకొల్లు ఓటమిని గుర్తుచేసి బాధపెడుతున్నట్లే కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో టీడీపీ తన వల్లే గెలిచిందంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలే ఇందుకు కారణం. గత ఎన్నికల్లో తాను టీడీపీకి ఇచ్చిన మద్దతును పవన్ పదే పదే గుర్తుచేసి విమర్శిస్తుండటంతో ఆ పార్టీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ప్రజారాజ్యం పార్టీని గుర్తుచేస్తున్నారు. తమ పార్టీని గెలిపించిన పవన్ మరి తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన పార్టీకి ఎందుకు విజయాన్ని కట్టబెట్టలేకపోయారంటూ ప్రశ్నిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో చిరంజీవి ఓడిపోతుంటే పవన్ ఏం చేయగలిగారని ఎద్దేవా చేస్తున్నారు. అనకాపల్లిలో అల్లు అరవింద్ ఓటమినీ ప్రస్తావిస్తున్నారు. సొంత మనుషులనే ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయిన పవన్ గత ఎన్నికల్లో టీడీపీని తానే గెలిపించానంటూ చెప్పుకుంటుండటం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్నీ పక్కన పెడితే ఇప్పుడు రానున్న తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్.. తెలంగాణా ఎన్నికల్లో బరిలోకి దిగిన బహుజన లెఫ్ట్ ప్రంట్ కి ప్రచారం చేయనున్నట్టు సమాచారం. అయితే తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బీఎల్‌ఎఫ్ నేతలు సినీ నటుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను ఎంచుకున్నట్లు ఆ పార్టీ అభ్యర్థుల సమాచారం. పవన్ ప్రచారం సభల కోసం వేదికలు, నియోజకవర్గాలను అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఎల్‌ఎఫ్ అభ్యర్థుల తరఫున ప్రచార బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడే పవన్ కు అసలు చిక్కు వచ్చి పడింది మాట మెదిలితే నేనే టీడీపీని గెలిపించాననుకుని అదే ప్రచారం చేసుకునే పవన్ ఇప్పుడు బీఎల్ఎఫ్ అభ్యర్ధులని గెలిపించలేరు ఎందుకు అనేది తెలంగాణాలో పరిస్థితిని అంచనా వేయగలవారికి అందరికీ అర్ధమవుతుంది. అంటే వారి ఓటమీ పవన్ కళ్ళు తెరిపిస్తుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు.