స్క్రిప్ట్ లో ఆ మాట లేదు… అందుకే పవన్ అలా

Pawan Kalyan follows BJP Script

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వేడి పుట్టిన పదిరోజులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఇంతకుముందు ఆయన కనిపించిన సీన్ గుర్తుందా జనసేన ఆవిర్భావ సభ, ఆపై విజయవాడలో లెఫ్ట్ నేతలతో ఒకటిరెండు భేటీలు. ఆ తర్వాతే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. పవన్ కేంద్రంతో కుమ్మక్కు అయ్యాడన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆపరేషన్ గరుడ గురించి నటుడు శివాజీ బయటకు తీసుకువచ్చారు. అందులో నిజానిజాలు దేవుడికి తెలియాలి గానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజం అన్న సందేహాలు ప్రతి ఆంధ్రుడికి కలుగుతున్నాయి. ఇప్పటిదాకా జగన్ మీద అనుమానపు చూపులు అనుకుంటే, పవన్ కూడా అదే కోవలో చేరిపోయారు. ఇక లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నడుస్తున్న తీరు ఇంకో ఎత్తు. ఇంత జరుగుతున్న సమయంలో లెఫ్ట్ నాయకులతో కలిసి పవన్ ప్రత్యేక హోదా సహా విభజన హామీల మీద పోరాటానికి నడుం బిగించడానికి ముందుకు వస్తున్నాడు అంటే మిగిలిన పార్టీల వాళ్లేమో గానీ జనసేన శ్రేణులు చాలా వూహించుకున్నాయి. టీడీపీ విమర్శల నుంచి తప్పించుకోడానికి ఈసారి ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తారని, చేయాలని ఆశించారు. అక్కడే వారి ఆశలు ఫలించలేదు.

లెఫ్ట్ తో కలిసి ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడా తన మీద వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేదు. అలాగని ఆ విమర్శల్ని తిప్పికొట్టే విధంగా బీజేపీ ని టార్గెట్ చేయనూ లేదు. ఇంకో సారి టీడీపీ ని టార్గెట్ చేశారు. ఇవ్వాల్సిన వాడిని అడక్కుండా అడగాల్సిన వాడిని తప్పుపట్టడంలో ఔచిత్యం ఏమిటో ఆయనకే తెలియాలి. ఇక పవన్ మాటల్లో ఇంకొన్ని కూడా ఆశ్చర్యం కలిగించాయి. అప్పుడెప్పుడో పుష్కరాల గురించి ఇప్పుడు మాట్లాడ్డం, అమరావతిలో తన సొంత ఇంటికి పదిహేను రోజుల కిందట పునాది వేసి ఇప్పుడు అది టీడీపీ రాజధాని అనడం నిజంగా ఆశ్చర్యం. ఏ కుల, మత, ప్రాంత రాజకీయాలకు తాను అతీతం అని ఇన్నాళ్లు పవన్ చెప్పుకుంటూ వచ్చాడో ఇప్పుడు అదే రాజకీయం చేస్తూ తాను కూడా పక్కా పొలిటికల్ లీడర్ అని నిరూపించుకున్నాడు. ఇదంతా గమనిస్తున్న ఇద్దరు జనసేన అభిమానులు పవన్ ఇంటికి శంకుస్థాపన చేసిన దగ్గరలోని ఓ సెంటర్ దగ్గర నుంచుని మాట్లాడుకున్నారు. అందులో ఒకడు ఈసారైనా మోడీ గురించి మాట్లాడితే బాగుండేదిరా అని కామెంట్ చేసాడు. ఆయనకి ఇచ్చిన స్క్రిప్ట్ లో ఆ మాట లేదులే అనుకుంటూ రెండో అభిమాని అక్కడ నుంచి నిరాశగా వెళ్ళిపోయాడు.