జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల గడవు ముగిసిన తర్వాత ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. ముందస్తు ఎన్నికలొస్తాయని ముందస్తుగా ఊహించలేపోయినందున పోటీ చేయడం కష్టమని పార్టీ భావించినందున ఎన్నికల బరి నుంచి వైదొలిగారట. సిద్ధంగా లేమని ఓ రాజకీయ పార్టీ కారణంగా చెప్పిందంటే దాని అర్థం చేతకాక వదిలేయడమే. వాస్తవానికి గత సార్వతిక ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ప్రారంభించారు. ఇప్పటికి దాదాపు ఐదేళ్లయింది. ఒక్కటంటే ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేయలేదు. పార్టీ ఎందుకు పెట్టారో తెలియదు కానీ బేషరతుగా టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించేశారు. అలా మద్దతు ప్రకటించడానికి పార్టీ పెట్టాల్సిన అవసరం ఏమిటో ? సరే ఎన్నికల ముందే పార్టీ పెట్టారు రాజకీయాలకు కొత్త బీఫామ్‌లు ఇవ్వలేక అలా చేశారేమో అనుకున్నా ఆ తర్వాత ఎన్ని ఎన్నికలు వచ్చాయి ? తెలంగాణలో మూడు నాలుగు ఉన్న ఎన్నికలు వచ్చాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఏపీలో నంద్యాల ఉపఎన్నిక వచ్చింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. వేటీలోనూ ఎందుకు పోటీ చేయలేకపోయారు.
ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడూ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగారు. పార్టీలన్నీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పవన్ తెలంగాణ ఎన్నికలపై స్పందించకపోవడం విచిత్రంగా ఉందని విశ్లేషకులు అంటూనే ఉన్నారు. కాగా గతంలో పలుమార్లు కేసీఆర్‌ను, పవన్ మెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్, టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటిస్తారనే వార్తలు అప్పట్లో వెలువడ్డాయి. ఆ వార్తలను జనసేన ఎక్కడా ఖండించిన దాఖలాలు లేవు. కాగా తెలంగాణలో జనసేనకు క్యాడర్ కూడా లేదు. అభిమానులు ఉన్నా, పార్టీ నిర్మాణం జరగనేలేదు. దీంతో తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ ఇష్టపడలేదని సమాచారం. అయితే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ ఎన్నికలు జరగనున్న విషయం విదితమే. ఫలితంగా తెలంగాణ ఎన్నికల ప్రభావం ఏపీపై తప్పనిసరిగా పడుతుందనే వాదన ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో జనసేన ఓడిపోతే ఏపీలో ఆ పార్టీ ఊనికికే ప్రమాదంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో పోటీపై పవన్ వెనకడుగు వేసినట్టు విశ్లేషకులు విశ్లేషిస్తున్న్నారు.