Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని విమర్శలు వస్తున్నా జనసేన రాజకీయంగా దూకుడుగా వ్యవహరించకుండా ఉండటానికి అధినేత పవన్ కళ్యాణ్ ని వెంటాడుతున్న ఓ భయం కారణం. ఆ భయమే ప్రజారాజ్యం వైఫల్యం. ఆ అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాల్ని జనసేన నిర్మాణంలో వాడుకోవాలని పవన్ గట్టి పట్టుదలతో వున్నారు. ప్రజారాజ్యం వైఫల్యానికి వున్న కారణాల్లో ఆ పార్టీ మీద పడ్డ కుల ముద్ర. 2009 ఎన్నికల ముందు ఇటు టీడీపీ అటు కాంగ్రెస్ లో కాకలు తీరిన కాపు నేతలు చాలా మంది ప్రజారాజ్యం పంచన చేరారు. అదే సమయంలో బీసీ, ఎస్సీ లకి చెందిన కొత్త శక్తులు ఎన్నో ప్రజారాజ్యం లో చేరినా దానికి రాని ప్రచారం ఈ కాపు నాయకుల చేరిక కి వచ్చింది. అప్పటిదాకా వున్న పార్టీలని వదిలిపెట్టి వచ్చిన నేతలు కొందరు ప్రెస్ మీట్స్ లో తమ కులానికి అధికారం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పిన సందర్భాలూ వున్నాయి. మొత్తంగా ఈ పరిణామం ప్రజారాజ్యం మీద కుల ముద్ర పడేందుకు కారణం అయ్యింది.
జనసేన అధినేతగా పవన్ అప్పటి ప్రజారాజ్యం అనుభవాన్ని బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు జనసేన మీద కూడా అలాగే కుల ముద్ర పడడం ఏ మాత్రం ఆయనకి ఇష్టం లేదు. కులం రాజకీయాల్లో ఓ భాగం అన్న చేదు నిజాన్ని గ్రహించినప్పటికీ దాని చుట్టూనే రాజకీయాలు తిప్పే సగటు, సంప్రదాయ వ్యూహాలకి భిన్నంగా వెళ్ళాలి అని పవన్ భావిస్తున్నారు. దాన్ని సమయం చూసుకుని బయట పెట్టారు. లగడ కాంగ్రెస్ లో ఆపై వైసీపీ లో పెత్తనం చేసిన ఓ కాపు నాయకుడు ఇటీవల పవన్ కళ్యాణ్ ని కలిసి రాజకీయాల మీద చర్చించారు. చివరిలో జనసేనలో చేరాలన్న ఆకాంక్ష వ్యక్తం చేసినప్పుడు పవన్ నేరుగా పాత నాయకుల్ని చేర్చుకునే ఉద్దేశం లేదని చెప్పడంతో ఆ నాయకుడు షాక్ అయ్యాడంట. ఈ విషయం పసిగట్టిన పవన్ దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని చెప్పడంతో పాటు దాని వెనుక వున్న కారణాలు వివరించారట. దీంతో ఆ నేత ఉస్సురంటూ వెనక్కి తిరిగారట.
సదరు నాయకుడితో భేటీ తర్వాత పార్టీ లో తనతో కలిసి పనిచేస్తున్న వారికి ఈ విషయాన్ని వివరించిన పవన్ ఇకపై టీడీపీ ,కాంగ్రెస్ , వైసీపీ ల నుంచి వచ్చే కాపు నేతల విషయంలో అత్యంత జాగ్రత్తగా వుండాలని సూచించారట. పార్టీ మీద కులముద్ర పడకుండా చూసేందుకు ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేద్దాం అన్న ఆలోచనలో పవన్ ఉన్నారట. అయితే తాను కుల రాజకీయాలకి వ్యతిరేకం తప్ప కులానికి కాదని పవన్ చెప్పారట. ఈ నిర్ణయం వల్ల కాపుల్లో అసంతృప్తి వచ్చే అవకాశం ఉందని ఓ అనుచరుడు చెప్పినప్పుడు ఆ కులానికి చెందిన యువకులు, కొత్త నాయకుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిద్దాం అని పవన్ వివరణ ఇచ్చారట. మొత్తానికి జనసేన మీద కులముద్ర పడకుండా పవన్ మాస్టర్ ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.