దాడి రీ ఎంట్రీ కి పవన్ సాయం !

Pawan Kalyan meets Dadi Veerabhadra Rao

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాట యాత్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మంగళవారం విశాఖ జిల్లాలో పర్యటన మొదలు పెట్టారు విశాఖపట్నంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన అనకాపల్లి వెళ్లారు. ఈ సందర్భంగా సీనియర్ రాజకీయ వేత్త దాడి వీరభద్ర రావు జనసేనానిని కలిశారు. దీంతో తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా కొనసాగి మంత్రిగా కూడా పనిచేసిన దాడి విరభద్రరావు రాజకీయాల్లోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయని ఆయన రీఎంట్రీకి జనసేన వేదిక కానుందని వార్తలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాడి ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఓడిన తర్వాత మొదట ఆ పార్టీని వీడి బయటకి వచ్చేశారు.

అయితే, అంతకుముందు టీడీపీని వీడినప్పుడు, తర్వాత వైసీపీని వీడినప్పుడు దాడి ఆయా పార్టీలు, అధినేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఏ పార్టీలో చేరకుండా నాలుగేళ్లుగా సైలెంట్ మోడ్ లో ఉన్నారు. అయితే, విశాఖపట్నం జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దాడితో భేటీ అయ్యారు. అనకాపల్లిలోని దాడి నివాసంలో ఏర్పాటుచేసిన విందుకు ఆయన హాజరయ్యారు. దీంతో జనసేన పార్టీ నుంచి దాడి వీరభద్రరావు రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. జనసేన పార్టీలోనూ ఇప్పటివరకూ సీనియర్ నేతలు ఎవరూ లేకపోవడంతో దాడి రాక ఆ పార్టీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కానీ అంతే మైనస్ కూడా ప్రజల్లోకి వెళ్తుంది దీంతో పవన్ ఏమి చేయనున్నాడో వేచి చూడాల్సిందే మరి.