Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన పోరాట యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. చిత్తూరు జిల్లలో ప్రారంభించిన యాత్ర ఆ తరువాత శ్రీకాకుళం జిల్లాలో పోరాట యాత్రగా మార్చి పర్యటన చేస్తూ గత పది రోజులుగా జనసేనాని పవన్‌కల్యాణ్ తన పర్యటన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన సొంత భద్రతా సిబ్బంది ఏర్పాటు చేసిన రక్షణా వలయంలోనే పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిపిన పర్యటన ఆసాంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు కనీస పోలీస్ భద్రత కూడా ఏర్పాటు చేయకపోవడంతో సొంత భద్రతా సిబ్బందితోనే జనసేనాని పర్యటన కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో పవన్ పర్యటన సందర్భంగా ఆయన భద్రతా బృందంలోని 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని, వారిలో కొందరికి తీవ్ర గాయాలు కూడా అయినట్లు జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించాయి. వారు కోలుకోవడానికి గాను సమయం పట్టే పరిస్థితి ఉన్నందున పవన్ కళ్యాణ్ వారిని తమ తమ స్వస్ధలాలకు పంపుతున్నట్లు ఆ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇలా వెళ్లిన భద్రతా బృందం సభ్యుల స్ధానంలో కొత్త వారు శ్రీకాకుళం చేరుకోవాల్సి ఉంది. అందువల్ల అనివార్య పరిస్ధితుల్లో గురువారం యాత్రకు విరామం ప్రకటించినట్లు పవన్ తన ప్రకటనలో వివరించారు. పవన్ పర్యటనలకు జనం తాకిడి ఎక్కువగా ఉండటం… మరోవైపు భద్రతా సిబ్బంది తక్కువగా ఉండటం కారణాలతో పవన్ కల్యాణ్ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ మారు మూల ప్రాంతంలో అతికొద్ది మంది పార్టీ అనుచరులతో కలిసి విడిది చేశారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర తదుపరి షెడ్యూల్‌ను గురువారం సాయంత్రం ప్రకటిస్తామని పార్టీ శ్రేణులు తెలిపాయి.