Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హీరోగా పవన్ కళ్యాణ్ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయనపై విస్తృతంగా వినిపించిన ఓ పుకారు టీడీపీ దివంగత నేత పరిటాల రవి ఆయనకు గుండు కొట్టించారని. ఓ వివాదంలో తలదూర్చిన పవన్ కు పరిటాల గుండు కొట్టించి హెచ్చరించారని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు. చివరికి డెక్కన్ క్రానికల్ పత్రికలో దీనిపై వార్త కూడా వచ్చింది. ఈ వార్తకు నిరసనగా 2003లో పవన్ కళ్యాణ్ డీసీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించడం, ఆ ఆందోళనను అప్పటి తేజ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేయడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించాయి కూడా.
ఈ పుకారులో నిజం లేదని పవన్ వాటిని ఖండించేవారు. అటు పరిటాల కూడా బతికి ఉన్న రోజుల్లో అనేక మార్లు ఈ వార్తను తోసిపుచ్చారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టంలేని వారే ఈ ప్రచారం చేశారని, తానెప్పుడూ పవన్ ను నేరుగా కలవలేదని ఆయన చెప్పేవారు. అయినా ఈ పుకారుకు చాన్నాళ్లు తెరపడలేదు. 2005లో పరిటాల రవి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యారు. అయితే పరిటాల హత్యకోసం ఆయన ప్రత్యర్థులకు పవన్ రూ. 50లక్షలు సాయం చేశారని, తనకు గుండు కొట్టించిన రవిపై అలా ప్రతీకారం తీర్చుకున్నారని… ప్రచారం సాగింది. పరిటాల హత్య తరువాత ఈ పన్నెండేళ్ల నుంచి ఇక ఎవరూ పవన్ కళ్యాణ్ పై వచ్చిన పుకార్ల గురించి మాట్లాడలేదు. డెక్కన్ క్రానికల్ కార్యాలయం ఎదుట జరిపిన ఆందోళన తర్వాత పవన్ కూడా ఈ అంశంపై స్పందించలేదు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆనాటి పుకారును ప్రజలకు తనే స్వయంగా గుర్తుచేశారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ లో కలియతిరుగుతున్న పవన్… విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఈ అంవశం లేవనెత్తి అందరికీ షాకిచ్చారు.
తమ్ముడు సినిమా షూటింగ్ జరుగుతుండగా చిన్నన్నయ్య ఫోన్ చేశారు. పరిటాల రవి నీకు గుండు గీయించి కొట్టారంట అని అన్నాడు. అసలు పరిటాల రవి ఎవరు అని నేనడిగాను టీడీపీ కార్యాలయం నుంచి ఫోన్ చేసి చెప్పారన్నాడు. అది ఒక అభాండం అని అర్ధమైపోయింది. ఆ ప్రచారం మూడేళ్లపాటు సాగి పేపర్ లో వార్తలొచ్చే స్థాయికి చేరుకుంది అని పవన్ తెలిపారు. తనకు ఎవరూ గుండు గీయించలేదని, షూటింగ్ లో చిరాకుగా ఉంటే తానే గుండు గీయించుకున్నానని చెప్పారు. గుండు గీయిస్తే ఊరుకునే వ్యక్తినా అని పవన్ ప్రశ్నించారు. కానీ ఈ దుష్ప్రచారం చేసిన వారిని తాను మనసులో పెట్టుకోలేదని, వారు తన ముందే తిరుగుతున్నారని పవన్ చెప్పారు. తనను ఎన్ని రకాలుగా అవమానించినా అవేమీ పట్టించుకోకుండా రాష్ట్రం అభివృద్ధి కోసమే టీడీపీకి మద్దతిచ్చానని తెలిపారు.