Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తన తల్లిని కించపరిచే వార్తాకథనాలు ప్రసారం చేశారని ఆరోపిస్తూ… ట్విట్టర్ వేదికగా… పవన్ ప్రారంభించిన యుద్ధంలో తొలిరోజు ఆయన ప్రధానంగా పదే పదే ప్రస్తావించిన మీడియా చానల్ టీవీ 9. ఆ చానల్ సీఈవో అయిన రవిప్రకాశ్ తో పాటు యజమాని శ్రీనిరాజ్ ను ఉద్దేశిస్తూ… విమర్శనాత్మక ట్వీట్ లు చేశారు పవన్. తనను శ్రీరెడ్డితో తిట్టించిన దర్శకుడు రాంగోపాల్ వర్మకు, శ్రీనిరాజ్ కు చుట్టరికం ఉందని కూడా ఆరోపించారు. అంతేకాకుండా పాత్ ఫొటో… కొత్త ఫొటో అంటూ… శ్రీనిరాజ్ ఫొటోలు కూడా ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. పవన్ ట్వీట్లు చూసి వర్మతో పాటు చాలా మంది… అభిమానులను దాడిచేయమని ఉసిగొల్పడానికే ఇలా ఫొటోలు పోస్ట్ చేశారా అని కూడా జనసేనానిపై విమర్శలకు దిగారు.
ఇలా పవన్ మొదలుపెట్టిన ట్విట్టర్ తొలిరోజు యుద్ధమంతా రవిప్రకాశ్, శ్రీనిరాజ్ పైనే సాగింది. అందరూ ఇది చూశారు… చదివారు… చర్చించుకున్నారు. పవన్ శ్రీనిరాజ్ ను టార్గెట్ చేశారనే నిర్ధారణకు కూడా వచ్చారు. కానీ విచిత్రంగా పవన్ ఇప్పుడు తన యుద్దానికి కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ట్విట్టర్ లో తాను చేస్తున్న యుద్ధం ఎవరిని ఉద్దేశించింది కాదని, కేవలం తన ఫీలింగ్స్ , అభిప్రాయాలను మాత్రమే వెల్లడిస్తున్నాను అంటూ… వింతవాదనకు తెరతీశారు. తన ట్వీట్లపై శ్రీనిరాజ్ లాయర్ సునీల్ రెడ్డి ఇచ్చిన నోటీసుకు స్పందనగా… పవన్ ఓ లేఖను ట్విట్టర్ లోనే పోస్ట్ చేశారు. ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వ్యక్తి చేసే ట్వీట్లు ఆ వ్యక్తి ఫీలింగ్స్, అభిప్రాయాలు వెల్లడిస్తాయని పవన్ సెలవిచ్చారు.
మీ క్లయింట్ ను ఉద్దేశించి నేను చేయనటువంటి ఓ ట్వీట్ కు ఆయన మీ ద్వారా ఎందుకు స్పందించారో నాకు ఆశ్చర్యం కలిగిందని కూడా పవన్ వ్యాఖ్యానించారు. మీ క్లయింట్ గురించి ఎలాంటి నిందామోపలేదని, ఆయనే అలా ఊహించుకుంటున్నారని లేదా తప్పు చేశానన్న భావనలో అయినా ఉండవచ్చని పవన్ సెటైర్ వేశారు. 2018 ఏప్రిల్ 20న తాను చేసిన ట్వీట్ లో మీరు చెప్పినట్టు… పరోక్ష నిందలు లేదా ఆరోపణలు లేదా నిరాధార వ్యాఖ్యలు లేవని, తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తన ఫీలింగ్స్ చెప్పానని పవన్ విన్నవించారు. సునీల్ రెడ్డి తన నోటీసులో చెప్పినట్టు… చట్ట ప్రకారం ఇది ఎవరిపైనా దాడిచేసినట్టు కాదన్నారు. తనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా… తన లక్ష్యం నుంచి తాను పక్కదోవ పట్టనని, సమాజంలోని అన్ని వర్గాలు ఎదగడానికి కృషిచేస్తానని పవన్ స్పష్టంచేశారు. పైన చెప్పిన వివరాలు దృష్టిలో ఉంచుకుని మీ క్లయింట్ కు సరైన సలహా ఇస్తారని భావిస్తున్నా… అని తన లేఖలో పేర్కొన్నారు పవన్.
మొత్తానికి ఈ లేఖ గమనిస్తే ఓ విషయం అర్ధమవుతోంది… తాను సెటైరికల్ గా ఈ లేఖ రాశానని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారమో గానీ… మీడియాపై ప్రకటించిన యుద్దంలో మొదట్లోనే ఆయన చేతులెత్తేసినట్టు పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. ఆర్భాటపు ట్వీట్లు కాస్తా… అసలు పోరాటం వచ్చేసరికి ఇలా పలాయనవాదం చిత్తగిస్తాయని ససాక్ష్యంగా నిరూపించారు. పవన్ ధైర్యంగా ఈ యుద్దాన్ని కొనసాగించేవారయితే… తొలిరోజు చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలి. అంతేగానీ శ్రీనిరాజ్ ఇలా నోటీసులు పంపించినవెంటనే అలా మాటమార్చేసి… నేను మిమ్మల్ని అనలేదు… నా ఫీలింగ్స్ మాత్రమే చెప్పాను అంటే…
ఒక్క శ్రీనిరాజ్ పైనే కాదు… నిన్నటిదాకా రవిప్రకాశ్… ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణను కూడా ఆయన ఏమీ అననట్టే… జస్ట్ ఆయన కూడా ఇతర సామాన్య వ్యక్తుల్లా తన ఫీలింగ్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారంతే… కాబట్టి… పవన్ విమర్శలపై ఎవరూ స్పందించాల్సిన పనిలేదు. ఆయన ఫ్యాన్స్ వాటిని సీరియస్ గా తీసుకోకూడదు. జర్నలిస్టులయితే రోడ్లెక్కి ఆందోళనలు చేయాల్సిన అవసరం అసలే లేదు. నాలుగేళ్లపాటు ట్విట్టర్ వేదికగా పార్టీని నడిపించిన జనసేనాని… నాలుగు నెలలు ప్రజాక్షేత్రంలో తిరిగి… మళ్లీ ట్విట్టర్ వేదికగా… మీడియాపై తన ఫీలింగ్స్ వ్యక్తీకరిస్తూ… మిగిలిన జీవితం గడపబోతున్నారన్నమాట.