కులసేన…ధనస్వామ్యం…!

Pawan Kalyan Secret Meeting Organized For Kapu Community
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఎక్కడుంటాడో తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడుతారో తెలియదు. అజ్ఞాతవాసి సినిమాలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్ పవన్ కి కరెక్ట్ గా సరిపోతుంది. “వీడి చర్యలు ఊహాతీతమని. రాజకీయాల్లో పవన్ నిర్ణయాలు ఎవరి ఊహకి అందవు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రతి నిర్ణయం ఊహాతీతమే అని చెప్పాలి. పదవి కోసం పార్టీ ని పెట్టలేదు అని అంటూనే 175 స్థానాల్లో పోటి చేస్తానంటారు. పార్టీని బలోపేతం చేసేందుకు మీటింగ్ లు పెడతారు జనాలు బాగా వస్తున్నారు అనుకునే లోపు మళ్ళీ అన్నీ ఆపేస్తారు. పార్టీలో చేరడానికి సభ్యత్వం అంటు టార్గెట్స్ పెడుతారు. ఒక పక్క పవన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల జనసేనపై ఇప్పటికే కులసేన అంటూ ముద్ర పడిపోగా, మరో పక్క పవన్ చేస్తున్న అంతూ పంతు లేని వ్యాఖ్యల పుణ్యమా అని జనసేన పార్టీ పూర్తిగా తెరమరుగు అయిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇప్పుడు స్వయానా పవన్ నిర్వహించిన సమావేశం ఒకటి ఆ పార్టీ పరువు నిట్టనిలువునా తీసి పారేసింది.
Pawan Kalyan's secret meeting in kakatheya hotel
ఆంధ్రప్రదేశ్‌లో కులపిచ్చి ఎక్కువగా ఉందని విజయవాడలో అయితే కులపిచ్చి మరీ ఎక్కువగా ఉందని అప్పట్లో చెప్పిన పవన్,  విజయవాడలో ప్రతి ఒక్కరినీ కులం దృష్టితోనే చూస్తారన్నారు. అయితే తనకు కులం, మతం, కుటుంబమనే భావన లేదన్న పవన్‌ ప్రజలే నా కులమని తనకు సమాజ శ్రేయస్సే ముఖ్యమని అప్పట్లో కుండబద్దలు కొట్టిన పవన్ కులపిచ్చి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు. అలాంటి పవన్ కల్యాణ్ నిర్వహించిన ఒక రహస్య సమావేసాన్ని ఒక తెలుగు టీవీ చానల్ బహిర్గతం చేసింది. జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపధ్యంలో ఆయన తన కాపు సామాజిక వర్గ ప్రముఖులతో ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు సదరు చానల్ ఒక సంచలనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. చానల్ కధనం ప్రకారం ఆదివారం హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో పవన్‌ కల్యాణ్‌ కాపు ప్రముఖలతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేవలం కాపు సామాజికవర్గానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలను మాత్రమే ఆహ్వానించారు.
pawan-kalyan-jan-asena
దాదాపు 150 మంది కాపు వర్గంలోని పెద్దలు ఈ సమావేశానికి హాజరైనట్టు చానల్‌ చెబుతోంది. ఇతరులెవరినీ సమావేశం దరిదాపుల్లోకి రానివ్వలేదు. లోపలి వెళ్ళిన నూట యాభై మంది దగ్గరా ఫోన్ లు లేకుండా జాగ్రత్త పడ్డారు. గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రసంగించిన పవన్ కల్యాణ్… పార్టీకి భారీగా విరాళాలు ఇవ్వాల్సిందిగా కాపు పారిశ్రామికవేత్తలను కోరినట్టు చానల్ వెల్లడించింది. సమావేశానికి హాజరైన వారి నుంచి కనీసం 10 లక్షల రూపాయలు ఎంట్రీ ఫీజ్‌ను వసూలు చేశారు. పవన్‌ కల్యాణ్ అడిటర్‌ రత్నం వచ్చిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఉన్న దృశ్యాలను కూడా చానల్ ప్రసారం చేసింది.
ఈ సమావేశానికి సింగపూర్, మలేషియాలో ఉంటున్న కాపు వ్యాపారవేత్తలు కూడా వచ్చారని చెబుతున్నారు. సమావేశానికి సంబంధించిన వివరాలను, పవన్‌ కల్యాణ్ అడిటర్‌ డబ్బులు వసూలు చేస్తున్న దృశ్యాలను పవన్‌ పార్టీలోని కొందరు తమకు పంపించారని సదరు చానల్ పేర్కొంటోంది. కులాలను కలుపుతూ చివరికి కులరహిత సమాజమే ధ్యేయంగా రాజకీయం చేస్తానని చెప్పే పవన్‌ కల్యాణ్ ఇలా ఒక సామాజికవర్గంతో రహస్య సమావేశం ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని సదరు చానల్ కధనాన్ని చూసిన జనాలు దుమ్మెత్తి పోస్తున్నారు.