Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రజలు కులాల ఉచ్చులో పడితే అమరావతి అభివృద్ధి అసాధ్యం అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వంతుగా చెప్పింది చేసే ప్రయత్నానికి ఓ అడుగు ముందుకు వేశారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజారాజ్యం వైఫల్యం వెనుక ఆ పార్టీ మీద పడ్డ కులముద్ర కూడా ప్రధాన కారణం. అప్పట్లో ప్రజారాజ్యం కార్యాలయం కాపు కులానికి చెందిన ఓ వ్యాపారవేత్త భవనంలో కొనసాగిన విషయం తెలిసిందే. ఇలాంటి ఎన్నో చిన్నచిన్న విషయాలు కలిసి ప్రజారాజ్యం మీద కాపు కుల ముద్ర పడడానికి కారణం అయ్యాయి. ఆ విషయం గుర్తుంచుకుని మరీ పార్టీ కార్యాలయ వ్యవహారంలో జనసేన అధిపతిగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
చినకాకానిలో జనసేన కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎంపిక చేసిన స్థలం స్థానిక కమ్యూనిస్ట్ నేత యార్లగడ్డ సుబ్బారావు కుటుంబీకులది. చినకాకాని వచ్చిన పవన్ ఆ ఊరిలో ఎన్నో ఏళ్ల పాటు సర్పంచ్ గా పనిచేసిన సుబ్బారావు ని పదేపదే గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో పార్టీని నడుపుతానని పవన్ చెప్పారు. ఇక జనసేన కార్యాలయం ఏర్పాటు చేస్తున్న స్థల యజమానులు కమ్మ కులానికి చెందిన వాళ్ళు. స్థానికంగా వామపక్ష భావజాలంతో పని చేసిన వాళ్ళు. వీరిని పేరుపేరునా జనసేన శ్రేణులకు పరిచయం చేసిన పవన్ సభ వేదిక నుంచి కృతజ్ఞతలు చెప్పారు. స్థల యజమానుల్లో ఒకరైన యార్గడ్డ అంకినీడు ప్రసాద్ కి పవన్ షేక్ హ్యాండ్ ఇచ్చి సన్మానం చేద్దామని భావించారు. అయితే సన్మానం వద్దని పవన్ ని సున్నితంగా వారించిన అంకినీడు ప్రసాద్ రెండు చేతులు జోడించి జనసేన అధినేతకు నమస్కారం చేశారు. దేశ సంస్కృతి కి తగ్గట్టు అభివాదం చేసిన అంకినీడు ప్రసాద్ గురించి పవన్ తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొత్తానికి జనసేన కార్యాలయానికి ఎంచుకున్న స్థలం విషయంలో కులాల మధ్య సామరస్యత కోసం పవన్ తన వంతుగా చేసిన ప్రయత్నం కనిపిస్తోంది.