Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరాంధ్రలో నటనకు సంబంధించి ఓనమాలు నేర్చుకున్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో నిరసన కవాతు నిర్వహించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ప్రేమ, అభిమానంతో పాలకొండ ప్రజలు తనను నలిపేశారన్నారు. ఉత్తరాంధ్రను స్థానిక నేతలు మర్చిపోయారేమో గానీ నటనకు సంబంధించిన ఓనమాలు ఇక్కడ నేర్చుకున్న మీ పవన్ కళ్యాణ్ మర్చిపోలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఘనస్వాగతం పలికిన పాలకొండ వాసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
చిన్నప్పుడు స్కూల్లో వీరఘట్టంలో పుట్టిన కోడిరామ్మూర్తి గురించి చదువుకున్నానని, ఆయన అంటే తనకెంతో ఇష్టమని, ఆయన స్ఫూర్తితోనే మార్షల్ ఆర్ట్స్ కు వెళ్లానని చెప్పారు. ఆ మహానుభావుడు నడిచిన నేలపై నడవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీకాకుళం నేలతల్లికి పాదాభివందనాలు చేస్తున్నానని చెప్పారు. నేతలు ఇచ్చిన మాటలు మార్చారు కాబట్టే తాను జనంలోకి వచ్చానని అన్నారు. మాట మార్చిన నేతలను ఎదుర్కోవాలంటే ప్రజల నుంచే సైన్యం రావాలని… అదే జనసైన్యమని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మొదటి నుంచి చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనుకబడేది కాదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అటకెక్కించారని, అడవిపుత్రులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తోటపల్లి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని, రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. రైతులు కంటతడి పెడుతోంటే తనకు ఎంతో బాధ కలుగుతోందన్నారు.