Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మీడియాపై ట్విట్టర్ వార్ లో భాగంగా పవన్ కళ్యాణ్ మరికొన్ని ట్వీట్స్ చేశారు. తనపై జరుగుతున్న కుట్రకు, అవమానాలకు కొందరు వ్యక్తులు కారణమని, కానీ చేయాల్సిందంతా చేసేసి… ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా తనకు క్షమాపణ చెబుతున్నారని పవన్ వెల్లడించారు. తన తల్లిని దూషించిన వారు రహస్యంగా క్షమాపణలు చెబుతున్నారని, పబ్లిక్ లో నోటికొచ్చినట్టు తిట్టి, ప్రయివేట్ గా క్షమాపణలు చెబుతున్నారని, ఇలాంటివి తన దగ్గర కుదరవని స్పష్టంచేశారు. ఆరు నెలలుగా తనను, తన తల్లిని, అభిమానులను, అనుచరులను నోటికొచ్చినట్టు తిట్టారని, ఇంతటి నీచబుద్ధి ఉన్న మీరు ఇప్పుడు రహస్యంగా క్షమాపణలు చెప్తారా… అని పవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
మనల్ని, మన తల్లుల్ని, ఆడపడుచుల్ని తిట్టే పేపర్లు ఎందుకు చదవాలని, వాళ్ల టీవీలు ఎందుకు చూడాలని పవన్ ప్రశ్నించారు. జర్నలిజం విలువలతో ఉన్న ఛానల్స్, పత్రికలకు మద్దతిస్తామని తెలిపారు. త్వరలోనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆడపడుచుల ఆత్మ గౌరవ పోరాట సమితి ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని, వీరికి జనసేన వీర మహిళా విభాగం అండగా ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. కాసేపటి తర్వాత పవన్ మీడియాను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. ఆ మూడు టీవీ చానళ్లను నడుపుతున్నదెవరు?… ఈ భావోద్వేగపు అత్యాచారాల నుంచి కాపాడేందుకు ఎలాంటి నిర్భయ చట్టం అవసరం అంటూ ప్రశ్నించారు. అటు పవన్ వైఖరికి నిరసనగా… జర్నలిస్టుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తార్నాక చౌరస్తాలో జర్నలిస్టులు నల్ల రిబ్బన్ లు కట్టుకుని నిరసన వ్యక్తంచేశారు. మీడియా సంస్థలపై పవన్ చేస్తున్న అసత్య ఆరోపణల ట్వీట్లపై మండిపడ్డారు. మీడియాపై పవన్ అభిమానుల దాడిని నిరసిస్తూ కూకట్ పల్లిలో వివిధ రాజకీయపార్టీల నాయకులు, జర్నలిస్ట్ సంఘాలు నిరసనకు దిగాయి.