జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చాలా రోజుల తర్వాత మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే మూడు విడతల్లో విశాఖ జిల్లా,గోదావరి జిల్లాలలో వారాహి యాత్ర చేసిన పవన్..ఇప్పుడు నాల్గవ విడత కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అయితే ఈ సారి వారాహి యాత్రపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ తర్వాత, టిడిపి-జనసేన పొత్తు నేపథ్యంలో వారాహి యాత్ర కొనసాగనుంది.
పైగా పవన్ కూడా వారాహి యాత్రని పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జనసేనకు పట్టున్న స్థానాల్లోనే పర్యటిస్తున్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో వారాహి యాత్ర కొనసాగుతుంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో కాపు వర్గం ఓట్లు ఎక్కువే. గత ఎన్నికల్లో 15-25 వేలు ఓట్లు ఒక్కో నియోజకవర్గంలో జనసేనకు వచ్చాయి. జనసేన ఓట్లు చీల్చడం వల్లే ఈ నాలుగు సీట్లలో వైసీపీ గెలిచింది…టిడిపి ఓడింది. కానీ ఈ సారి అలాంటి పరిస్తితి రాకూడదని పొత్తు పెట్టుకుంది.
ఈ పొత్తులో పవన్ యాత్రకు జనసేనతో పాటు టిడిపి శ్రేణుల మద్ధతు కూడా దక్కే ఛాన్స్ ఉంది. దీంతో వారాహి యాత్ర భారీ స్థాయిలో కొనసాగుతుందని వైసీపీకి చెక్ పెట్టడం ఖాయమని ప్రచారం వస్తుంది. అదే సమయంలో పొత్తులో జనసేన ఈ నాలుగు సీట్లలో ఖచ్చితంగా మూడు సీట్లు తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాలుగు చోట్ల టిడిపికి ఓట్లు ఎక్కువే. జనసేన కంటే డబుల్ బలం టిడిపికి ఉంది. కాకపోతే జనసేన కలిస్తేనే టిడిపికి గెలుపు.
ఈ క్రమంలో జనసేన సీట్లు కేటాయించాలి. ఇందులో మచిలీపట్నం సీటు టిడిపికే ఫిక్స్. అక్కడ టిడిపి నేత కొల్లు రవీంద్ర ఉన్నారు. ఇక పెడనలో టిడిపి ఇంచార్జ్ కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. అయితే ఇక్కడ టిడిపికి బలం ఎక్కువ. అటు జనసేనకు పట్టు ఎక్కువ. అలాంటప్పుడు ఈ సీటుపై క్లారిటీ రావాలి. కైకలూరు పొత్తులో జనసేనకు దక్కే ఛాన్స్ ఉంది. అవనిగడ్డ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్.