అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండడం, రూపాయి విలువ బలపడుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో 90 రూపాయలు దాటిన పెట్రోల్ ధరలు గత నెలన్నర రోజులలో పైసా పైసా తగ్గుతూ వస్తూ, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70 రూపాయలకు చేరువగా వస్తుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర పైన 40 పైసలు తగ్గి రూ. 77.25 ఉండగా, డీజిల్ ధర పైన 45 పైసలు తగ్గి రూ. 73.68 గా ఉంది. విజయవాడలో ఇవే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వరుసగా రూ. 76.61 మరియు రూ. 72.67 ల వద్ద కొనసాగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరపైన 37 పైసలు, డీజిల్ ధరపైన 41 పైసలు తగ్గించిగా, అవి వరుసగా రూ. 72.87 మరియు రూ.67.72 ల వద్ద కొనసాగుతున్నాయి. ఇక వాణిజ్యరాజధాని ముంబై విషయానికి వస్తే, పెట్రోల్ ధరపైన 37 పైసలు, డీజిల్ ధరపైన 44 పైసలు తగ్గి, పెట్రోలు ధర రూ.78.43 గా, డీజిల్ ధర రూ.70.89 గా ఉన్నాయి. దేశంలో పెట్రోల్ ధరలు 75 రూపాయలకు దిగువున రావడం ఏప్రిల్ నెల తర్వాత ఇదే మొదటిసారి. ఈ మధ్య జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతి విషయంలో అమెరికా మన దేశానికి ఊరట కల్పించడం ఒక కారణం కాగా, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరల పతనం మరియు రూపాయి మారకపు విలువ బలం పుంజుకోవడం అనేవి పెట్రోల్ మరియు డీజిల్ ధరల తగ్గుదలకు కారణాలుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం డాలర్ కు రూపాయి మారకపు విలువ 69.64 రూపాయలుగా ఉంది.