తెలంగాణలో ఎన్నికల ఫలితాల తర్వాత టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత కేసీఆర్ మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండా తన కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు అప్పగించి ఆయన రాష్ట్ర అవసరాల కంటే వ్యక్తిగత మైలేజీకే ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి హోదాలో ఒక్క ఫైలు పైనా సంతకం చేయకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలను కలిశారు. కొంత విరామం తీసుకుని మరికొందరిని కలవనున్నారు. అలాగే, జాతీయ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఢిల్లీలో శాశ్వత అవసరాల కోసం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని జరుగుతున్నా ఈ విషయాలేమీ భారత ప్రధాని మోడీకి తెలియవట. ఇది చెప్పింది ఎవరో కాదు స్వయంగా మోడీనే. నిన్న ఓ జాతీయ మీడియా ఛానెల్ తో మోడీ మాట్లాడుతూ పలు అంశాల మీద స్పందించారు.
వీటిలో ప్రముఖంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతున్న మహాకూటమి గురించి మాట్లాడారు. ‘‘అసలు మహాకూటమి అనే మాటకే అర్థం లేదు. ఒక వ్యక్తి లక్ష్యంగా పార్టీలన్నీ ఏకమవుతాయా?. ఇలాంటి. రాజకీయాన్ని జనం తిప్పికొడతారు. ఇది దేశం వర్సెస్ మహాకూటమి. తెలంగాణలో మహాకూటమి గతి ఏమైంది. అసలు మహాకూటమిపై చర్చించాల్సిన అవసరం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసమే నాయకులు ఏకమవుతున్నారు’’ అంటూ కూటమిపై సెటైర్లు గుప్పించారు. ఇదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి స్పందించిన ఆయన అసలు కేసీఆర్ ఒక కూటమి ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నట్లు నాకు తెలియదు. ఆయన కూటమి గురించి ఇప్పటి వరకు ఆలోచించలేదని కామెంట్ చేశారు. వాస్తవానికి ప్రధానికి చీమ చిటుక్కుమన్నా ఇట్టే చెప్పేసే ఇంటలిజెన్స్ సంస్థలు అందుబాటులో ఉంటాయి. అలాంటిది కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాట్లు, ముఖ్యమంత్రులను కలవడం, ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని ఢిల్లీ సర్కారుని స్థలం కోరడం ఇన్ని చేస్తే మోడీ దాకా విషయం వెళ్లలేదని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటో ?