Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇరవైఏళ్ల కాలంలో భారత జీడీపీ దాదాపు ఆరు రెట్లు పెరిగిందని ప్రధాని నరేంద్రమోడీ దావోస్ వేదికగా ప్రపంచానికి తెలియజెప్పారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని మాట్లాడడం 20 ఏళ్లలో ఇదే తొలిసారి. 1997లో భారత ప్రధాని దేవెగౌడ దావోస్ వచ్చారని, అప్పట్లో భారత ఆర్థిక వ్యవస్థ 400 మిలియన్ డాలర్లుగా ఉండేదని ప్రధాని చెప్పారు. గడచిన రెండు దశాబ్దాల్లో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, భారత్ వేగంగా వృద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. భిన్నమతాలు, సంస్కృతులు, భాషలు కలిగిన భారతదేశంలో ప్రజాస్వామ్యం అందరినీ ఏకతాటిపై నిలుపుతోందన్నారు. ప్రజాస్వామ్యం తమకొక రాజకీయ విధానమే కాదని, అది తమ జీవనశైలని ప్రధాని వ్యాఖ్యానించారు. వసుధైక కుటుంబం అనేది భారతీయ తాత్త్విక చింతన అని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధి అనేది 120 కోట్ల మంది భారతీయుల ఆశయమన్నారు.
మూడేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బీజేపీ అనేక సంస్కరణలు చేపట్టిందని, వ్యాపార అనుకూల ర్యాంకింగ్ లో భారత్ స్థానం ఇటీవల గణనీయంగా మెరుగుపడిందని చెప్పారు. ప్రపంచ ఆర్థిక ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్దంగా ఉందన్నారు. మానవ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడం అందరి ముందున్న సవాల్ అని ప్రధాని అన్నారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి పథంలో పయనించేలా ఈ సదస్సు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. పరస్పర ఆధారిత సమాజ అభివృద్ధిలో ఆర్థిక వేదిక సదస్సు చుక్కానిలా వ్యవహరిస్తోందన్నారు.
ఇరవైఏళ్లకాలంలో ప్రపంచంలో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ఇంటర్నెట్, బిగ్ డేటాతో ప్రపంచమంతా అనుసంధానమవుతోందని, మన మాట, పని అన్ని విషయాలను సాంకేతికత ప్రభావితం చేస్తోందని మోడీ అభిప్రాయపడ్డారు. సైబర్ పరిజ్ఞానం చెడు పనులకు వినియోగించకుండా నిరోధించడమే అసలైన సమస్యగా మారిందన్నారు. అందరం భూమిపుత్రులమన్న మాట గుర్తుపెట్టుకుని మనుగడ సాగించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి తరం సుఖం కోసం ప్రకృతిని ధ్వంసం చేయవద్దని సూచించారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు విశ్వం మనుగడకు సవాల్ గా మారాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న మరో తీవ్రమైన సమస్య ఉగ్రవాదమని, యావత్ ప్రపంచానికి ఉగ్రవాదం పెను సవాళ్లు విసురుతోందని ప్రధాని హెచ్చరించారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని మరోసారి ప్రధాని స్పష్టంచేశారు.