తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి గడువు రేపటితో (డిసెంబర్ 5) ముగియనుంది. ఇక ఏమి చేయాలన్నా, ప్రజలను తమ హామీలతో ప్రసన్నం చేసుకోవాలన్నా, మాటలతో మభ్యపెట్టాలన్నా ఈ రెండు రోజుల్లోనే చేయవలసి ఉండడంతో తమ రాజకీయ చతురతని ప్రదర్శించడానికి తంత్రాలన్నీ ప్రయోగిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీ కి కాదనలేని ప్రజల మద్దతు ఉంది. సరైన నాయకులు నిలబడి ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్ళినట్లైతే విజయావకాశాలు మెండుగా ఉండేవి. కనీసం ఇతర పార్టీలతో సంధి చేసుకొని, కూటమిని ఏర్పాటుచేసుకుని ఎన్నికల బరిలో దిగినట్లైతే ఎవరూ ఊహించలేని విజయం వరించేదేమో. కానీ, ఆ దిశగా ఆలోచించకుండా ఒంటరిగా బరిలోకి దిగిన బీజేపీ గురించి ప్రజలు అంతగా మాట్లాడుకోకపోవడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఎటుకూడి ఎన్నికల సమరం తెరాస పార్టీ మరియు ప్రజకూటమి ల మధ్య సమరంలా మారిందే తప్ప, మిగిలిన పార్టీల గురించి వినబడేలా మాట్లాడుకోకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి, దత్తాత్రేయ వంటి మంచి పేరున్న నాయకులు ఉండనే ఉన్నారు. దేశంలోని పాలన రాష్ట్రంలో పాలన అనేట్లుగా బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో విజయంకోసం కాంక్షిస్తుంది.
గత నెల నవంబర్ 28 న బీజేపీ నాయకుడు, దేశ ప్రధాన మంత్రి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్ నగర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలకి హాజరై, ప్రసంగించిన విషయం విదితమే. ప్రధాని రావడం, ప్రసంగించడం రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినప్పటికీ, విజయావకాశాలు మెరుగవ్వాలంటే నరేంద్ర మోడీ మళ్ళీ రావాల్సిన అవసరం ఉండడంతో, ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ స్టేడియంలో జరగనున్న భారీ బహిరంగసభకు మోడీ హాజరవుతున్నారు. ఢిల్లీ నుండి సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొని, రోడ్డు మార్గంలో ఎల్బీ నగర్ కి వెళ్తారు. తన ప్రసంగం ముగియగానే నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి ఢిల్లీకి తిరుగుప్రయాణం చేస్తారు. ఈ భారీ బహిరంగ సభకి సంబంధించి తగిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసిన, పార్టీ కార్యవర్గ శ్రేణులు, సభా వేదిక మీద నలభై మంది ఆసీనులయ్యేలా వేదికను ఏర్పాటుచేసి, గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుండి ప్రజలను సమీకరించే పనిలో నిమగ్నమైయున్నారు.