Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కర్నాటక ఎన్నికల ప్రచారమంతా సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సాగుతోంది. బహిరంగసభల్లోనూ, సోషల్ మీడియాలోనూ ఈ సవాళ్ల పర్వం జరుగుతోంది. కర్నాటకంలో తొలిసారి ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్న ప్రధాని మోడీ…రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. తాను మాట్లాడితే 15 నిమిషాలు ప్రధాని పార్లమెంట్ లో కూర్చోలేరని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…ప్రధాని ఈ సవాళ్ల పర్వానికి తెరలేపారు. ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ..కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాల గురించి 15నిమిషాలు ఇంగ్లీష్ లేదా హిందీ లేదా…తన తల్లి సోనియా మాతృభాష ఇటాలియన్ లో పేపర్ లేకుండా మాట్లాడాలని సవాల్ చేశారు. దీనిపై రాహుల్ కన్నా ముందుగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు.
కర్నాటకంలో గతంలో యడ్యూరప్ప సర్కార్ సాధించినవేమిటో…15నిమిషాలు పేపర్ చూస్తూ అయినా మాట్లాడాలని ప్రతిసవాల్ విసిరారు. తాజాగా రాహుల్ కూడా ట్విట్టర్ లో ప్రధానికి సవాల్ విసిరారు. కర్నాటక బీజేపీ నేతలపై ఉన్న క్రిమినల్ కేసులు, అవినీతి గురించి పేపర్ పట్టుకునైనా ఐదు నిమిషాలు సమాధానమిస్తారా అని ఎద్దేవాచేశారు.రాహుల్ తో పాటు సిద్ధరామయ్య కూడా మరోసారి మోడీకి సవాల్ విసిరారు.
బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో అవినీతి చేయడం కాంగ్రెస్ నైజం అన్న ప్రధాని వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ట్విట్టర్ లో మండిపడ్డారు. డియర్ మోడీ సర్ అని సంబోధించిన సిద్ధరామయ్య……సంక్షేమం పేరుతో కాంగ్రెస్ నిధులు లూఠీ చేస్తోందని మీరు వ్యాఖ్యానించారు. అందుకు ఆధారాలేమైనా ఉన్నాయా…అని ప్రశ్నించారు.
బెంగళూరును స్మార్ట్ సిటీగా మార్చడానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశామని అన్నారని, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే మీడియా ముందు ప్రవేశపెట్టాలని ప్రధానిని కోరారు. అవినీతి గురించి ప్రధాని మాట్లాడడం విని తాను ఆశ్చర్యపోయానని, ప్రస్తుతం అదే మోడీ బలహీనతని సిద్ధరామయ్య ఎద్దేవా చేశారు. బీజేపీ అభ్యర్థుల ఎంపికలోనూ అవినీతే ఉందని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో రెడ్డి బ్రదర్స్ ఎలా, ఎందుకు గెలవాలో ఓ ఐదు నిమిషాలు మాట్లాడగలరా…అని సవాల్ విసిరారు. గాలి బ్రదర్స్ అవినీతిని సీబీఐ కూడా ఏమీ చేయలేకపోతే..తాము చేస్తామని, వాళ్లకు బుద్ధి చెబుతామని, ప్రస్తుతం సిట్ కూడా అదే పనిలో ఉందని ఆయన తెలిపారు. అవినీతి కేసులో జైలుపాలయిన బీజేపీ సీఎం గురించి, ఆయన అరడజను మంది సహచరుల గురించి కర్నాటక ప్రజలకు బాగా తెలుసని సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. మొత్తానికి నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఎన్నికలకు ముందు కర్నాటకం రసవత్తరంగా మారింది.