Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తుంటే సినిమా జనాలు మాత్రం హాయిగా సినిమాలు చేసుకుంటూ, చూసుకుంటూ ఏసీల్లో నిద్ర పోతున్నారు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ ఇన్నాళ్లు హోదా విషయాన్ని మర్చి పోయి, తాము హోదా కోసం ఉద్యమంలో పాల్గొనేందుకు వస్తే అరెస్టులు చేయించి ఇప్పుడు మాపై విమర్శలు చేస్తున్నారా అంటూ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంను ఢీ కొట్టాలి కాని సినిమా వారు ఉద్యమం చేయడం లేదంటే ఎలా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. తాము ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేసేందుకు విజయవాడ వెళ్తే ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్‌లు చేయించింది మీరు కాదా అంటూ పోసాని ప్రశ్నించాడు.
టీడీపీ నాయకుడి వ్యాఖ్యలపై ప్రముఖ రచయిత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కూడా తన ఆగ్రహంను వ్యక్తం చేశాడు. ఇంత కాలం బీజేపీ నాయకులను నమ్మి, వారితో కలిసి సంసారం చేసిన టీడీపీ వారు వైకాపాకు పోటీగా ప్రత్యేక హోదా ఉద్యమంను అందుకుందని, అలాంటి ఉద్యమానికి తాము మద్దతు పలకాలా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ నాయకులు మొదటి నుండి కూడా ప్రత్యేక హోదా అక్కర్లేదు అంటూ చెబుతూ వచ్చారు. ఇప్పుడు మాత్రం ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు, అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. ఇందతా కూడా పబ్లిక్‌ను ఆకర్షించేందుకు తప్ప మరేం లేదని, పైగా సినిమా నటులను ఈ విషయంలో విమర్శించే హక్కు టీడీపీ వారికి లేదు అంటూ ఇతర నటీనటులు తీవ్ర స్థాయిలో ఆగ్రహంను వ్యక్తం చేశారు. సినిమా వారికి బుద్ది ఉందని, రాజకీయ నాయకులు బుద్ది తెచ్చుకుని ఇప్పటికైనా చిత్తశుద్దితో ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలని సినిమా వారు అంటున్నారు.