సూపర్ స్టార్ కృష్ణ చిన్నల్లుడు సుధీర్‌బాబు హీరోగా పరిచయం అయ్యి చాలా కాలం అవుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు మంచి కమర్షియల్ సక్సెస్‌లను దక్కించుకోలేక పోయాడు. మద్యలో ‘ప్రేమ కథా చిత్రమ్’తో సక్సెస్‌ను దక్కించుకున్నప్పటికి అది ఆయనకు పూర్తి స్థాయి క్రెడిట్‌ను ఇవ్వలేదు. అయినా కూడా ఆ సినిమా పేరు చెప్పుకుంటూ ఇంత కాలం కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు. తాజాగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ చిత్రంతో సుధీర్‌బాబు ఒక సక్సెస్ చిత్రాన్ని దక్కించుకున్నాడు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే సుధీర్‌బాబు నటనతో పాటు, సినిమా బాగుందనే టాక్ విశ్లేషకుల నుండి వస్తుంది. దాంతో సుధీర్‌బాబు మరి కొంత కాలం ఇండస్ట్రీలో కొనసాగేందుకు ఊపిరి అందినట్లయ్యిందని సినీ వర్గాల వారు అంటున్నారు.
మహేష్‌బాబు ఎంతగా ప్రయత్నించినా, వెన్నంటి ఉన్నా కూడా సుధీర్‌బాబుకు సక్సెస్‌లు అనేవి అందని ద్రాక్ష మాధిరిగానే ఉన్నాయి. సక్సెస్‌లు దక్కించుకోవడంలో విఫలం అవుతున్న సుధీర్‌బాబు మంచి సినిమాలు ఎంచుకుంటూ మెల్ల మెల్లగా కెరీర్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సమ్మోహనం చిత్రం తర్వాత పుల్లెల గోపీచంద్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని చేసేందుకు సుధీర్‌బాబు సిద్దం అవుతున్నాడు. ఇండియాలో బ్యాడ్మింటన్‌కు గుర్తింపు తెచ్చిన వ్యక్తిగా గోపీచంద్‌కు మంచి పేరుంది. ఆయన శిష్యులు పలు పతకాలు రాబడుతూ అద్బుతమైన ప్రతిభను కనబర్చుతున్నారు. ఇలాంటి సమయంలోనే సుధీర్‌బాబు ఆయన జీవిత చరిత్రను సినిమాగా చేయబోతున్నాడు అనడంతో అందరి దృష్టి ఈ చిత్రంపై ఉంది. మరి ఈ చిత్రంతో మరో సక్సెస్‌ను సుధీర్‌బాబు తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.