చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రకాశం జిల్లా వాసులు దుర్మరణం పాలయ్యారు. రాజనంద గావ్ జిల్లాలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డోంగర్‌గఢ్ సమీపంలోని ‘మా బమలేశ్వరీ దేవి’ ఆలయాన్ని సందర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని సోమని గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన పదిమందిలో తొమ్మిదిమంది ప్రకాశం జిల్లాకు చెందిన వలస కార్మికులు వుండడం గమనార్హం.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒకే కుటుంబానికి చెందిన 9 మంది తెలుగువారే కావడం బాధాకరం. ప్రకాశం జిల్లా కనిగిరి, కొండెపి నియోజకవర్గాలకు చెందిన వీరంతా పొట్టికూటికోసం దశాబ్దాల కిందటే చత్తీస్‌గఢ్‌కు వలసవెళ్లారు. మృతుల్లో కనిగిరి నియోజకవర్గం మంగంపల్లి గ్రామానికి చెందిన పాపా బత్తిన పెదమంగయ్య (27), భార్య వెంకటలక్ష్మి(25), మంగయ్య సోదరి మనీషా (18), పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు (18), వెంగన గుంటకు చెందిన పోకూరి ఆదినారాయణ (40), భార్య సావిత్రి(32), గార్లపేటకు చెందిన ఆండ్ర విజయ్ కుమార్ (35), ఆయన భార్య నాగమణి(30) మృతి చెందారు. అయితే కారు డ్రైవరు మాత్రం స్థానికుడేనని సమాచారం.
డొంగార్‌గఢ్‌లో మాతా బమ్లేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాలను తిలకించేందుకు శనివారం ప్రైవేటు వాహనంలో బయలుదేరిన వీరంతా దైవదర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, వీరు ప్రయాణిస్తోన్న వాహనం రాయ్‌పూర్- నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయింది. ముందు వెళ్తోన్న ఓ బస్సును తప్పించే క్రమంలో వీరి వాహనం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దీంతో వాహనంలోని 10 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం నుంచి 1970లలో చాలా మంది ఛత్తీస్‌గఢ్‌కు వలసవెళ్లి, అక్కడ స్టీల్‌ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. మృతుల్లో పాపాబత్తిని పెద్దమంగయ్య కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.