Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ వైఖరిని తప్పుబట్టి వార్తల్లో నిలిచిన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్…మరోసారి గొంతు విప్పారు. దేశ రాజకీయాల్లో తాజా సంచలనం తాజ్ మహల్ వివాదంపై ఆయన స్పందించారు. ట్విట్టర్ వేదికగా…యూపీ ప్రభుత్వం, హిందూ సంస్థలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాజ్ మహల్ చరిత్ర తవ్వకాలు మొదలుపెట్టారని, ఇంతకీ తాజ్ మహల్ ను ఎప్పుడు పడగొట్టాలని అనుకుంటున్నారో చెబితే…తన పిల్లలకు చివరిసారిగా తాజ్ మహల్ ను చూపిస్తానని ట్వీట్ చేశారు. ఇటీవల తాజ్ మహల్ పై జరుగుతున్న వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
యూపీలోని బీజేపీ ప్రభుత్వం ఆరునెలల పాలనా కాలం పూర్తిచేసుకున్న సందర్భంగా పర్యాటక ప్రాంతాలతో విడుదలచేసిన బుక్ లెట్ లో తాజ్ మహల్ పేరుచేర్చకపోవడంతో వివాదం మొదలయింది. అనంతరం బీజేపీ ఎమ్మెల్యే సంగీత్ సోము తాజ్ మహల్ ను విద్రోహులు నిర్మించిన కట్టడంగా అభివర్ణించారు. ఈ వివాదాన్ని కొనసాగిస్తూ…బీజేపీ ఎంపీ..వినయ్ కతియార్…తాజ్ మహల్ ఒకప్పుడుశివాలయమని, తేజో మహాలయ్ గా పిలిచేవారని, షాజహాన్ ఆలయాన్ని కూల్చివేసి తాజ్ మహల్ నిర్మించారని చరిత్రకు కొత్త భాష్యం చెప్పే ప్రయత్నంచేశారు.
తాజ్ మహల్ పై చెలరేగిన వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజ్ మహల్ కూడా అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం రామజన్మభూమి అవుతుందన్న విశ్లేషణలూ వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ తాజ్ మహల్ పై వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు చూస్తోంటే…ఆయన కేంద్రప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తున్నారని అర్దమవుతోంది. గౌరీలంకేశ్ హత్య కేసు నిందితులను అరెస్టు చేయకపోవడంపై ఆయన ప్రధానిమోడీని తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు తాజ్ మహల్ వివాదంపైనా…పరోక్షంగా కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడారు. మరో ట్వీట్ లో ప్రశ్నించడం కొనసాగిస్తా..ఇది నా ప్రాథమిక హక్కు అని ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యానించారు.