Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తెలుగులో ప్రసంగం ప్రారంభించడంతో పాటు మధ్యమధ్యలో తెలుగులో మాట్లాడుతూ తెలుగు ప్రముఖులను స్మరిస్తూ స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. సోదర, సోదరీమణులకు నమస్కారం అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి దేశభాషలందు తెలుగు లెస్స అని కొనియాడారు. దేశం గర్వించదగ్గది… ఉత్తరదక్షిణ భారతాలను కలిపే వారధి తెలుగుభాషని రాష్ట్రపతి అభివర్ణించారు. దేశంలో అత్యధిక మంది మాట్లాడే రెండో భాష తెలుగని, తెలుగు సంస్కృతి, సాహిత్యం దేశానికి, నాగరికతకు ఎంతో తోడ్పాటు అందించాయని కొనియాడారు. సంస్కృతం, అరబిక్, ఉర్దూ, ఆంగ్ల తదితర భాషల పదాలను కూడా తనలో చేర్చుకుని ప్రవాహంలా సాగుతున్న భాష తెలుగని ప్రస్తుతించారు.
ఖండాంతరాల్లో తెలుగు మాట్లాడుతున్నారని, చదువుతున్నారని అందుకే తెలుగు ఇప్పుడు ప్రపంచ భాషని విశ్లేషించారు. హైదరాబాద్ భిన్న సంస్కృతులు, సంప్రదాయాల నగరమని, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిందని, ఈ నగరాన్ని తలచుకోగానే బిర్యానీ, బ్యాడ్మింటన్, బాహుబలి గుర్తుకొస్తాయన్నారు. ఏ దేశమేగినా… ఎందుకాలిడినా… పొగడరా నీ తల్లి భూమి భారతిని …నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని రాష్ట్రపతి ప్రసంగాన్ని ముగించారు. తెలుగు మహాసభల ప్రారంభంరోజులానే… ముగింపు రోజుకూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకునేలా సాగింది. స్వరాష్ట్రంలో సగర్వంగా, సమున్నతంగా, వైభవోపేతంగా, అద్భుతంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించుకున్నామని కేసీఆర్ ప్రకటించారు. తెలుగును మృతభాష కానివ్వబోమని, సజీవ భాషగా నిలుపుదామని పిలుపునిచ్చారు. సభలు, సంబురాలతో సరిపుచ్చబోమని, తెలుగు వెలుగుల కోసం నిబద్ధతతో సంపూర్ణ కృషి కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు.
తెలంగాణ గడ్డమీద చదువుకోవాలంటే తెలుగును కచ్చితంగా చదవాల్సిందేనని స్పష్టంచేశారు. ఇకపై ఏటా డిసెంబర్ లో రెండు రోజుల పాటు తెలుగు మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి వచ్చే నెల మొదటివారంలో సాహితీవేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి, వారి సలహాలు, సూచనలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. సభల ప్రారంభంరోజు తాను చెప్పిన ఒకటి, రెండు పద్యాలను చాలా మంది అభినందించారని, మహాసభల సందర్భంగా అందరూ సంతోషమైన హృదయంతో నవ్వుతూ ఉన్నాం కాబట్టి తన ప్రసంగాన్ని నవ్వుల పద్యంతో ముగిస్తానంటూ ఓ హాస్య పద్యం చెప్పారు.
మహాసభల ప్రారంభంరోజు లాగే ముగింపు రోజు కూడా లేజర్ షో ఆహుతుల్ని విశేషంగా అలరించింది. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో ఎల్బీ స్టేడియం ధగధగలాడింది. ఓ వైపు లేజర్ షో కాంతులు, మరోవైపు వెలుగులు విరజిమ్ముతూ బాణాసంచా మెరుపులు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తరువాత రాత్రి 7.30గంటల సమయంలో మొదలైన లేజర్ షో సుమారు 15 నిమిషాల పాటు సాగింది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జరిగిన మహాసభలు పరిపూర్ణమయ్యాయి.