Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హైదరాబాద్ లో మంగళవారం మెట్రోరైలు ప్రారంభించిన ప్రధాని మోడీ ఇంతవరకూ ఎవరికీ దక్కని అరుదైన గౌరవాన్ని పొందారు. తన పాలనాకాలంలో రెండు మెట్రో రైళ్లు ప్రారంభించిన తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించారు. ఒకే ఏడాదిలో ఆయన రెండు మెట్రో రైళ్లు ప్రారంభించడం విశేషం. ఈ ఏడాది జూన్ 17న కొచ్చిలో మెట్రో రైలును ప్రారంభించారు ప్రధాని. మళ్లీ నిన్న నవంబర్ 28న హైదరాబాద్ మెట్రోకు పచ్చజెండా ఊపారు. ఇలా రెండు వేర్వేరు నగరాల్లో మెట్రోలు గతంలో ఏ ప్రధానీ ప్రారంభించలేదు. నిజానికి మూడు మెట్రో రైళ్లు ఒకే ఏడాది ప్రారంభించే అవకాశం కూడా ప్రధానికి ఉంది కానీ.
ఆయన లక్నో మెట్రో ప్రారంభోత్సవానికి వెళ్లలేదు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వమే ఉన్నప్పటికీ…ఆయన ఎందుకనో అక్కడి మెట్రోను ప్రారంభించలేకపోయారు. ఆయనకు బదులుగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ సెప్టెంబరు 5న లక్నో మెట్రోను ప్రారంభించారు. ఈ ఒక్క ఏడాదే దేశంలో మొత్తం మూడు మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడం… వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు నిదర్శనమని పలువురు విశ్లేషిస్తున్నారు.
ట్రాఫిక్ కష్టాలు తీర్చే మెట్రో తొలి కూత దేశంలో తొలిసారి 1984లో కోల్ కతాలో వినపడింది. నిజానికి ఎక్కువ జనాభా ఉండే కోల్ కతాలో మెట్రో ప్రతిపాదనను 1949లోనే తెరపైకి తెచ్చింది అప్పటి ప్రభుత్వం. అది కార్యరూపం దాల్చడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఫ్రెంచి నిపుణలు మెట్రో నమూనా తయారుచేయగా… 1969లో కోల్ కతా మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్టు ఏర్పాటుచేసింది. రష్యా, జర్మనీకి చెందిన ఇంజనీర్లు మెట్రో మాస్టర్ ప్లాన్ ను తయారుచేశారు. 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మెట్రో పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత 12 ఏళ్లకు 1984లో ఇందిరాగాంధీ చేతుల మీదగా స్వతంత్ర భారత దేశంలో తొలి మెట్రో పరుగులు పెట్టింది.
సాధారణంగా దేశంలోని ఓ నగరంలో ఏదన్నా కొత్త సౌకర్యం ప్రారంభమైతే మిగిలిన నగరాలూ వెంటనే దాన్ని అందిపుచ్చుకునేందుకు పోటీపడతాయి.కానీ కోల్ కతా మెట్రో ప్రారంభమైన తర్వాత మళ్లీ మరో మెట్రో కూత దేశంలో వినపడడానికి 18 ఏళ్లు పట్టిందంటే… అప్పటి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, వాటి పురోగమనం అర్దంచేసుకోవచ్చు. 2002లో ప్రధాని వాజ్ పేయి ఢిల్లీ మెట్రోను ప్రారంభించారు. తర్వాత తొమ్మిదేళ్లకు 2011లో బెంగళూరు మెట్రో మొదలయింది. అప్పటి సీఎం సదానంద గౌడ బెంగళూరు రైలును ప్రారంభించారు.
ఆ తర్వాత మాత్రం నగరాలు వెనువెంటనే మెట్రో బాట పట్టాయి. 2013 సెప్టెంబరులో జైపూర్ మెట్రోను రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరారాజే సింథియా ప్రారంభించగా… డిసెంబరులో గుర్ గావ్ మెట్రోకు హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ పచ్చజెండా ఊపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మిగిలిన అన్ని నగరాలతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందిందని భావిస్తాం. కానీ అక్కడ 2014 జూన్ లో కానీ మెట్రో పట్టాలెక్కలేదు. తర్వాత ఏడాది 2015 జూన్ లో చెన్నై మెట్రోను అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించారు. తర్వాత ఈ ఏడాది వరుసగా కొచ్చి, లక్నో, హైదరాబాద్ మెట్రో పరుగులు తీసింది.