మాట మెదిలితే తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల వైఎస్ జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని కమెడియన్ పృధ్వీ ప్రశ్నించారు. నిన్న గుంటూరులో జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబు జగన్ ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పోసానిని, కృష్ణుడిని కుక్కలమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాపలా కుక్కలాగా ఉంటాం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా అంశం నిలబడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఎక్కడ పశువులు కనిపించినా వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఖాలే కనిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
ఇక తాను వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి ప్రచారం చేస్తున్నానన్న వ్యాఖ్యలని ఆయన కొట్టి పారేశారు. తాను ఏమీ ఆశించి ప్రచారం చేయడం లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాపు రిజర్వేషన్లపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తాజాగా పృధ్వీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. జగన్ కాపులకి న్యాయం చేస్తానని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..? రైతులకి రుణమాఫీ చేస్తానని 2014లోనే జగన్ చెప్పి ఉంటే ఆయన సీఎం అయ్యుండేవారు. ఆయన జరిగేవే చెప్తారు జరగని వాటి గురించి తప్పుడు హామీలు ఇవ్వరని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే 2014లో చాలా చోట్ల ప్రచారం చేశానని అప్పుడు పార్టీ నుంచి ఏం ఆశించలేదు ఇప్పుడు కూడా ఎమ్మెల్యే కాదు కదా కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్‌ను కూడా ఆశించడం లేదు. నన్ను జెండా మోసే సామన్య కార్యకర్తగా మాత్రమే చూడండి. జగన్‌ని సీఎంగా చూడాలనేది నా కోరిక. ఊపిరి ఉన్నంత వరకూ ఆయన వెంటే ఉంటా’ అని పృధ్వీ వెల్లడించారు.