చంద్రబాబుకు పురందేశ్వరి రిలీఫ్ ఇచ్చినట్టే.

Purandeswari says BJP won't do CBI Raid on Chandrababu

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కి బలమైన రాజకీయ ప్రత్యర్ధులు సైతం ఆయన్ని ఎప్పుడోసారి పోనీలే అనుకుని ఉండొచ్చు కానీ దగ్గర బంధువు దగ్గుబాటి పురందేశ్వరి ఒక్క సారి కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ అవకాశం వచ్చిన ప్రతిసారి చంద్రబాబు మీద విమర్శలు, ఆయన్ని ఇబ్బంది పెట్టే మాటలు లేకుండా పురందేశ్వరి అడుగు ముందుకు వేయరు. అయితే తాజాగా ఆమె బీజేపీ మహిళా మోర్చా నాయకురాలి హోదాలో మాట్లాడిన మాటలు మాత్రం చంద్రబాబుకి ఫుల్ గా రిలీఫ్ ఇచ్చాయి.

Nda నుంచి టీడీపీ బయటకు వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ మీద యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి ఏ క్షణం అయినా చంద్రబాబు మీద బీజేపీ కక్ష సాధింపు మొదలు అవుతుందని ఊహాగానాలు వచ్చాయి. బీజేపీ తో అంటకాగుతున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అయితే చంద్రబాబుని జైలుకు పంపేదాకా ప్రధాని కార్యాలయానికి వెళుతూనే ఉంటానని నిస్సిగ్గుగా ప్రకటించారు. ఇక చంద్రబాబు సైతం కర్ణాటక ఎన్నికల తర్వాత టీడీపీ మీద కేంద్రం కక్ష సాధించే ఛాన్స్ ఉందని బహిరంగ సభలు, ధర్మ పోరాట దీక్షల్లోనే ప్రకటించారు. అదే పరిస్థితులు వస్తే తన కోసం ముందుకు రావాలని జనానికి పిలుపు కూడా ఇచ్చారు. కానీ అలా జరగలేదు. అయితే ఆకస్మికంగా ఎప్పుడో సారి ఆ పరిస్థితి వస్తుందని చంద్రబాబు అప్రమత్తంగానే వుంటున్నారు. అయితే చంద్రబాబు మీద సిబిఐ దాడులు జరిపించే ఉద్దేశం లేదని పురందేశ్వరి చెప్పారు. బీజేపీ ని వెనకేసుకొచ్చేందుకు ఆమె ఈ మాటలు చెప్పినప్పటికీ తొలిసారిగా పురందేశ్వరి వ్యాఖ్యలు చంద్రబాబుకి ఊరట కలిగించాయని చెప్పుకోవచ్చు.