వైసీపీలోకి పీవీపీ…దాసరికి షాక్ తప్పదా ?

PVP To Join In YCP

వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఏపీలో కీలక నేతలతో పాటూ ప్రముఖులు కూడా పార్టీలోకి క్యూ కడుతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. రేపు హైదరాబాద్ లోటస్‌పాండ్‌ లో జగన్‌ను కలిసి పీవీపీ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని చెబుతున్నారు. విజయవాడ పార్లమెంట్‌ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పీవీపీ పోటీ చేస్తారని, ఈ నెల 23న ఆయన నామినేషన్‌ వేస్తారని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లోనే పీవీపీ వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పట్లో ఆయనకు సీటు దక్కలేదు.

ఈ సారి కూడా ఆయన విజయవాడ నుంచే బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడంతో వైసీపీ అధిష్ఠానం అంగీకరించినట్లు తెలుస్తోంది. సీటుపై క్లారిటీ రావడం.. జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. బెజవాడ స్థానానికి ముందు పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ పోటీ చేస్తారని భావించినా.. ఆయన పోటీకి సుముఖతగా లేకపోవడంతో పీవీపీ పేరు తెరపైకి వచ్చిందట. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పొట్లూరి అయితే బలమైన అభ్యర్థని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారట. విజయవాడ ఎంపీ టికెట్ ఆశిస్తూ ఇటీవల జైరమేష్ వైసీపీలో చేరారు. అయితే ఇప్పుడు పీవీపీ పేరు తెరమీదకు రావడంతో ఆయన సందిగ్ధంలో పడ్డారు. జైరమేష్ ను పక్కనబెట్టడంపై ఆయన వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎంపీగా పోటీచేసి గెలవాలనుకుంటున్న పొట్లూరి వరప్రసాద్ కల ఈసారైన నెరవేరుతుందో లేదో చూడాలి.