Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేట్ సెంటిమెంట్ మరోసారి అశ్వినీదత్ కు కలిసొచ్చింది. ఆయన కుమార్తెలు స్వప్నా, ప్రియాంక నిర్మించగా… అల్లుడు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన మహానటి ప్రభంజనం సృష్టిస్తోంది. నిజానికి మహానటి రంగస్థలంతో పాటుగా… మార్చి 30న విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు… అశ్వినీదత్ డేట్ సెంటిమెంట్ తో సినిమా విడుదల మే 9కి వాయిదా పడింది. ఈ తేదీ అశ్వినీదత్ కు బాగా కలిసొస్తుందని మహానటి ఘనవిజయంతో మరోసారి రుజువయింది. ఎందుకంటే సరిగ్గా 28 ఏళ్ల క్రితం… ఇదే రోజున విడుదలైన భారీ బడ్జెట్ మూవీ జగదేకవీరుడు-అతిలోకసుందరి… బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించింది. ఆ సెంటిమెంట్ తో మహానటిని కూడా మే 9నే రిలీజ్ చేయాలని అశ్వినీదత్ భావిస్తున్నట్టు సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగింది.
అనుకున్నట్టుగానే మహానటి కూడా ఫస్ట్ షో నుంచే భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అశ్వినీదత్ నిర్మాణంలో తాను దర్శకత్వం వహించిన జగదేకవీరుడు-అతిలోకసుందరిని, ఇప్పటి మహానటిని పోలుస్తూ ట్విట్టర్ లో కామెంట్ చేశారు. 28 ఏళ్ల క్రితం ఇదే రోజున భారీ వర్షం…. చాలా పెద్ద సినిమా తీశామనే ఆనందం… ఎలా ఆడుతుందో అన్న భయం. వరద ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూపు… ఎట్టకేలకు సాయంత్రం నుంచి జనాలు సినిమాహాళ్ల వైపు కదిలారు… మరుసటిరోజు నుంచి వరద థియేటర్లలో అభిమానుల రూపంలో కనిపించింది. మా దత్తుగారికి ఆ రోజున ఎంత ఆనందం కలిగిందో ఇప్పటికీ మర్చిపోలేను అని ఆనాటి తీపిజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు రాఘవేంద్రరావు.
జగదేకవీరుడు అతిలోకసుందరి విడుదలైన రోజే మహానటి కూడా రిలీజ్ అయిందని, ఆ రోజున ఆ సినిమా నిర్మించడానికి ఎంత ధైర్యం కావాలో ఇప్పుడు మహానటి నిర్మించడానికి అంత ధైర్యం కావాలని రాఘవేంద్ర రావు వ్యాఖ్యానించారు. సావిత్రి చరిత్ర తరతరాలకు అందించిన స్వప్న సినిమాకు, వైజయంతి మూవీస్ కు ధన్యవాదాలు తెలిపారు. సావిత్రి పాత్రలో కీర్తిసురేశ్ జీవించిందని, జెమినీ గణేశన్ గా దుల్కర్ సల్మాన్ నటన అద్భుతమని రాఘవేంద్రరావు ప్రశంసించారు. మొత్తానికి మే 9 అప్పుడూ, ఇప్పుడూ చరిత్రలో నిలిచిపోయే సినిమాలకు సాక్షిగా నిలిచిందన్నమాట.