Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అండర్ -19 వరల్డ్ కప్ గెలిపించిన కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ప్రశంసలు కురిసిన సమయంలోనే ఆయనపై ఓ ఆరోపణ కూడా వినిపించింది. పాకిస్థాన్ తో సెమీఫైనల్ అనంతరం ద్రవిడ్ పాక్ డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్ మేనేజర్ తో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ద్రావిడ్ స్పందించాడు. తనపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమన్నాడు. న్యూజిలాండ్ నుంచి భారత్ వచ్చిన తర్వాత ముంబైలో అండర్ -19 జట్టు కెప్టెన్ పృథ్వీ షాతో కలిసి ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. పాక్ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలని జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ ఆహ్వానించగా..ఆయన కోరికను మన్నించి ద్రావిడ్ వారి వద్దకు వెళ్లి మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి.
ఆ వార్తల్లో నిజం లేదని ద్రావిడ్ అన్నాడు. పాక్ జట్టులో ఒక ఎడమ చేతి వాటం బౌలర్ టోర్నీలో బాగా రాణించాడని, అతన్ని అభినందించడానికి డ్రస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లాను తప్ప …రూమ్ లోకి వెళ్లలేదని ద్రావిడ్ స్పష్టంచేశాడు. తాను పాక్ కుర్రాళ్లతో మాట్లాడలేదని ఆయన తెలిపాడు. వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో పాక్ పై ఘనవిజయం సాధించి భారత్ ఫైనల్ కు వెళ్లింది. ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలిచి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. రాహుల్ ద్రావిడ్ కోచింగ్ తీరు వల్లే భారత కుర్రాళ్లు టోర్నీలో నిలకడగా రాణించగలిగారని అందరూ ప్రశంసించారు. రాహుల్ వల్లే ఈ విజయం సాధ్యమైందని జట్టులోని ఆటగాళ్లంతా ద్రావిడ్ ను కొనియాడారు. భారత్ వెనక ద్రవిడ్ ఉండడం వల్లే సెమీఫైనల్లో తమపై గెలవగలిగిందని పాక్ ఆటగాళ్లు సైతం వ్యాఖ్యానించారు. అందరూ తనపై ప్రశంసలు కురిపిస్తోంటే ద్రావిడ్ మాత్రం జట్టు సమిష్టి కృషికి ఫలితమే ఈ విజయమని అన్నారు.
ఫైనల్లో భారత్ అత్యున్నత స్థాయి ఆట ఆడలేదని, కానీ, క్వార్టర్స్, సెమీస్ లో మాత్రం కుర్రాళ్లు చాలా బాగా ఆడారని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. అండర్ -19 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలోనే ఐపీఎల్ వేలం జరగడం భారత కుర్రాళ్లకు ఇబ్బందిగా మారిందని ద్రావిడ్ చెప్పాడు. వేలం సందర్భంగా కుర్రాళ్లు పరిణతి ప్రదర్శించారని ప్రశంసించాడు. ఐపీఎల్ వేలానికి ముందు, వెనక వారం రోజుల పాటు పరిస్థితులు ఇబ్బందికరంగా సాగాయని, ఐతే కుర్రాళ్లు చూపిన పరిణతికి అభినందించాలని అన్నాడు. వేలం అవ్వగానే ఆ సంగతి వదిలేసి ప్రాక్టీస్ లో మునిగిపోయారని, అయితే ఆ మూడు రోజులు మాత్రం తాను కొంచెం భయపడ్డానని ద్రవిడ్ తెలిపాడు. ఐపీఎల్ వేలంలో అండర్ -19 జట్టులోని ఏడుగురు అమ్ముడుపోయారు.