Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలవాలని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే ప్రచారంతో హోరెత్తిస్తోంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుని ప్రధానమంత్రి మోడీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గుజరాత్ లో మూడు రోజుల పాటు పర్యటించిన ఆయన ప్రధానిపైనా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పైనా విమర్శల వాన కురిపించారు. పేద ప్రజలకు మోడీ కలలను అమ్మేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. 2028 నాటికి మోడీ ప్రతి గుజరాతీకి చంద్రుడిపై ఇళ్లు కట్టించి ఇస్తారని ఎద్దేవా చేశారు. మరో రెండేళ్లకు అంటే 2030 నాటికి అసలు చంద్రుణ్ణే భూమి మీదకు తీసుకొస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రెండు దశాబ్దాల క్రితమే గుజరాత్ లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్… మళ్లీ అక్కడ పుంజుకోలేకపోయింది. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక… కాంగ్రెస్ స్థితి రాష్ట్రంలో అంతకంతకూ దిగజారిపోయింది. ప్రధానిగా ఎన్నికై మోడీ గుజరాత్ వీడడం, ఆయనంత బలమైన వ్యక్తి రాష్ట్రంలో లేకపోవడం, వరుసగా అధికారంలో ఉండడం వల్ల ప్రభుత్వంపై తలెత్తే వ్యతిరేకత వంటి అంశాలను సానుకూలంగా మలుచుకుని ఈ సారైనా ఎన్నికల్లో గెలుపొందాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో అహ్మద్ పటేల్ గెలుపొందిన తరువాత కాంగ్రెస్ కు గుజరాత్ పై ఆశలు పెరిగాయి. ప్రధాని మోడీ, అమిత్ షాలు తెర వెనక ఎన్ని విధాలుగా ప్రయత్నించినా… వాటిని తిప్పికొట్టి.. సర్వశక్తులూ ఒడ్డి అహ్మద్ పటేల్ ను గెలిపించుకున్న కాంగ్రెస్ అదే రీతిలో గుజరాత్ ఎన్నికల్లోనూ విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ క్రమంలోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచూ గుజరాత్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తున్నారు.