Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో ఖాతా కూడా తెరవకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ తాజా రాజకీయ పరిణామాలతో తిరిగి అక్కడ నిలదొక్కుకునేందుకు ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ఎంతగా పోరాడుతున్నా పట్టించుకోని బీజేపీ ఆంధ్రుల దృష్టిలో కాంగ్రెస్ కన్నా పెద్ద దోషిగా నిలిచింది. అయితే బీజేపీ మీద కోపం కాంగ్రెస్ మీద ప్రేమగా మార్చడానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుగులేని పాచిక విసిరారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రత్యేక హోదా కి మద్దతు ఇస్తూ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతో పాటు పోలవరాన్ని త్వరగా పూర్తి చేయాలని రాహుల్ ఆ ట్వీట్ లో అభిప్రాయపడడమే కాదు… అన్ని పార్టీలు ఈ విషయంలో ఆంధ్రాకి మద్దతుగా ఐక్యంగా నిలబడాలని పిలుపు ఇచ్చారు.
రాహుల్ తాజా ట్వీట్ ప్రధాని మోడీ వైఖరితో విసిగిపోయిన టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మీద వేసిన వల గా రాజకీయ విశ్లేషకుల భావన. బీజేపీ ని దెబ్బ తీయాలంటే nda మిత్రపక్షాలను దూరం చేయాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో అనుకుంటోంది. మోడీ మొండివైఖరితో కాంగ్రెస్ పని తేలిక అయ్యింది. మోడీకి దూరం అయిన చంద్రబాబుని దగ్గరకు తీసుకోడానికి ఇప్పుడు హోదా ఉద్యమం అనుకోని వరంలా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు మనసుకి దగ్గర అయ్యేలా హోదా అంశాన్ని టచ్ చేశారు. ఒకానొక దశలో వైసీపీ తో పొత్తు గురించి ఆలోచించినా బీజేపీ కి దగ్గర కావడానికి జగన్ తహతహలాడుతున్న తీరు చూసి రాహుల్ ప్లాన్ బి అమల్లోకి తెచ్చారు. రాహుల్ వ్యూహాలకు టీడీపీ నుంచి ఏ మాత్రం సానుకూల సంకేతాలు కనిపించినా వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రరాదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి.