Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గుజరాత్ లో కాంగ్రెస్ ను ఎలాగైనా గెలిపించాలని లక్ష్యంగా పెట్టుకుని విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల వేళ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకముందూ, తర్వాత… ప్రచారంలో భాగంగా అనేక దేవాలయాలు సందర్శిస్తున్న రాహుల్ బుధవారం ప్రఖ్యాత సోమ్ నాథ్ ఆలయానికి వెళ్లారు. అయితే ఆలయంలోపలికి ప్రవేశించే ముందు ఆయన నాన్ హిందూ విజిటర్స్ లిస్ట్ లో తన పేరు నమోదు చేయడం వివాదంగా మారింది. హిందువులు కాని వారు మాత్రమే సంతకం చేసే ఆ లిస్ట్ లో రాహుల్ గాంధీ పేరు ఉండడం సోషల్ మీడియలో వైరల్ అయింది. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ పేరు కూడా ఆ రిజిస్టర్ లో ఉంది. రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ మండిపడింది.
తాను హిందువును కాదని ఎట్టకేలకు రాహుల్ అంగీకరించాడని, బీజేపీ ఐటీ విభాగం హెడ్ అమిత్ మాలవ్య ట్వీట్ చేశారు. విశ్వాసాల పరంగా ఆయన హిందువు కాదని అర్ధమయిందని, దేవాలయాలను సందర్శిస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఓట్ల కోసమే రాహుల్ నమ్మకం లేకపోయినా… గుడులు చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై కాంగ్రెస్ వెంటనే స్పందించింది. ఆలయం లోపలకి మీడియా ప్రతినిధులను తీసుకెళ్లేందుకు మాత్రమే రాహుల్ సంతకం చేశారని, అందులో ఆయన పేరుగానీ, అహ్మద్ పటేల్ పేరుగానీ లేవని, తర్వాత ఎవరో వాటిని నమోదుచేశారని కాంగ్రెస్ మీడియా సమన్వయ కర్త మనోజ్ త్యాగి ప్రకటన విడుదలచేశారు. అటు రాహుల్ గాంధీ సోమ్ నాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ప్రధాని మోడీ తప్పుబట్టారు. సోమ్ నాథ్ ఆలయ నిర్మాణంపై దివంగత ప్రధాని నెహ్రూ అయిష్టత వ్యక్తంచేశారని, ఇప్పుడు ఆయన వారసులు గతాన్ని మరిచి ఆలయాన్ని సందర్శిస్తున్నారని తప్పుబట్టారు.