ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణా మాదిరిగా కలసి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏ రెండు పార్టీలు కూడా సిద్ధపడటం లేదు. ప్రత్యేకహోదా కోసం అంటూ టీడీపీ కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా వ్యవహరిస్తోంది. అయితే అది జాతీయ స్థాయిలో మాత్రమే. కూటమిగా తెలంగాణలో పోటీచేసినా సరైన ఫలితాలు రాలేదు. తెలంగాణ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చి ఉండి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో కానీ.. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఏపీలో సీట్ల సర్దుబాటు లేదా పొత్తు అనే ప్రస్తావన వచ్చే అవకాశం లేదు. చంద్రబాబు కూడా.జాతీయ స్థాయి వరకూ ఆలోచిస్తున్నారు కానీ దాన్ని ఏపీ వరకూ తీసుకురాదల్చుకోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయమే. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఒంటరి పోరేనన్న చర్చ ప్రారంభమయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ అంశంపై దృష్టి సారించారు. ఏపీ ముఖ్య కాంగ్రెస్ నేతలందర్నీ నెలాఖరులో ఢిల్లీకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద నుంచి అభిప్రాయ సేకరణ జరిపారు. ఆ అభిప్రాయాలను రాహుల్ గాంధీకి ఇవ్వనున్నారు. అదే సమయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరిగా పోటీ చేయడం ఖాయమే. కానీ ఆయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాల్సి వస్తోంది. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి ఎదురెళ్లలేని పరిస్థితుల కారణంగా.. సుడి గుండంలో వైసీపీ చిక్కుకుపోయింది. అలాగే జనసేన పార్టీతోనూ జగన్ కు కలిసే అవకాశం లేదు. చర్చలు జరిగాయని ప్రచారం జరిగినా ఇద్దరి మధ్య సీఎం పీఠం పెద్ద పజిల్‌గా మిగిలిపోతుంది కాబట్టి కలిసే అవకాశమే లేదు. ఇక జనసేన వైసీపీతో కలవదు. మరి ఎవరితో కలుస్తుందనేది అస్పష్టంగా ఉంది. టీడీపీతో పొత్తులు పెట్టుకుంటారన్న అంచనాతో జగన్ కమ్యూనిస్టుల్ని దూరం పెడుతున్నారు. కానీ.. ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి.. చంద్రబాబు వారితో ఎలాంటి పొత్తులు పెట్టుకునే అవకాశం లేదని తేలినప్పుడు జనసేన వామపక్షాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే.. జనసేనకు అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. కొన్ని సీట్లను.. వామపక్షాలకు ఇచ్చినా ఒత్తిడి తగ్గుతుందనే ఆలోచన చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అంటే వామపక్షాలు మినహా మరే పార్టీ కూడా ఏపీలో కలసి పోటీ చేయడానికి సిద్ధంగా లేవని చెప్పుకోవచ్చు. విపక్షాల ఓట్లన్నీ ఏకమయ్యే పరిస్థితి కూడా లేదు. ఇది ఖచ్చితంగా అధికార పార్టీకి లాభం చేకూరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.