Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వాగతించారు. సుప్రీం తీర్పుతో ముస్లిం మహిళకు తమ హక్కులను తిరిగి కల్పించినట్టయిందని. న్యాయ పోరాటం చేసిన మహిళలకు తన అభినందనలని అని రాహుల్ ట్వీట్ చేశారు. ఇప్పుడయితే కాంగ్రెస్ ఈ తీర్పును స్వాగతిస్తోంది కానీ….సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. అప్పుడు అధికారంలో రాజీవ్ గాంధీ ఉన్నారు. ట్రిపుల్ తలాక్ బాధితురాలు అయిన షాబానో అనే మహిళ అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన భర్త అహ్మద్ ఖాన్ మూడుసార్లు తలాక్ చెప్పి తనను వదిలేశాడని, అతని చేత తనకు భరణం ఇప్పించాలని కోరుతూ ఆమె క్రిమినల్ కేసు పెట్టింది. అయితే ఇస్లాం ప్రకారం తాను ఇద్దత్ కాలానికి మాత్రమే భరణం చెల్లిస్తానని అహ్మద్ ఖాన్ వాదించాడు.
ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు షాబానోకు అనుకూలంగా తీర్పుచెప్పింది. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఇప్పుడయితే ఎక్కవమంది ముస్లింలు స్వాగతిస్తున్నారు కానీ…షాబానో కేసులో వచ్చిన తీర్పును మాత్రం అప్పుడు దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. ముస్లిం మతపెద్దల ఒత్తిడికి తలొగ్గిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ముస్లిం ప్రొటెక్షన్ అండ్ డైవర్స్ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ముస్లింలు ఇద్దత్ కాలానికి మాత్రమే భరణం చెల్లిస్తే సరిపోతుంది. ఈ చట్టంతో ముస్లిం మతపెద్దలు శాంతించారు కానీ…ముస్లిం మహిళల హక్కులను ప్రభుత్వం కాలరాసిందంటూ సాధారణ ముస్లిం కుటుంబాల నుంచి రాజీవ్ కు వ్యతిరేకంగా భారీ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రగతిశీల ఆలోచనలతో ఉంటారని ఎన్నో విషయాల్లో పేరు తెచ్చుకున్న రాజీవ్ ఈ చట్టం వల్ల తీవ్రస్థాయిలో విమర్శల పాలయ్యారు. కొందరు ముస్లింల ఒత్తిడికి తలొంచటం వల్లే ఆయన ఈ చట్టం తీసుకువచ్చాని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇప్పుడు కూడా కొందరు ముస్లింల నుంచి వ్యతిరేకత వస్తున్నా… ట్రిపుల్ తలాక్ విషయంలో సుప్రీం తీర్పు ను స్వాగతించి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ కు భిన్నంగా వ్యవహరించారని, కాంగ్రెస్ లో మారిన ఆలోచనా ధోరణికి ఇది నిదర్శనమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
మరిన్ని వార్తలు: