టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోల్లో రాజ్ తరుణ్ ఒకరు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రాజ్ తరుణ్ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నారు. గోదావరి యాసలో మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. వెంటనే ‘సినిమా చూపిస్త మావ’, ‘కుమారి 21ఎఫ్’ చిత్రాలతో హిట్లు అందుకున్నా ఆ తరవాత వరుస ఫ్లాపులతో వెనకబడిపోయారు. కిందటేడాది ‘రంగులరాట్నం’, ‘రాజుగాడు’, ‘లవర్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా లాభం లేకుండా పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టుకొట్టాలని ఒక మంచి ప్రేమకథను ఎంపిక చేసుకున్నారు.
రాజ్ తరుణ్ హీరోగా నూతన దర్శకుడు జి.ఆర్.కృష్ణ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం టైటిల్ ‘ఇద్దరి లోకం ఒకటే’. షాలిని పాండే హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తుండగా సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అబ్బూరి రవి మాటలను రాస్తున్నారు. ఓ విదేశీ చిత్రం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఇదొక ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ అట. అయితే, ఈ సినిమాలో రాజ్ తరుణ్ ప్రేమకథ విషాదాంతం అని టాక్. సాధారణంగా మనం తెలుగు సినిమాల్లో చివరికి హీరోహీరోయిన్లు కలుసుకోవడమే చూస్తుంటాం. ప్రేమకథలు విషాదాంతమవటం తమిళ సినిమాల్లో తప్ప తెలుగులో చూసింది లేదు.
కానీ, ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో హీరో కోసం హీరోయిన్ త్యాగం చేస్తుందని సమాచారం. సినిమాకు ఇదే హైలైట్ పాయింట్ అని తెలుస్తోంది. అసలు ఈ పాయింట్ నచ్చే దిల్ రాజు ఈ కథను ఎంపిక చేసుకున్నారట. పెద్ద హీరోలతో ఇలాంటి స్టోరీలు చేస్తే ఫ్యాన్స్ అంగీకరించరు కాబట్టి రాజ్ తరుణ్‌ను సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం. దీనికి తోడు దిల్ రాజు లాంటి నిర్మాత నిర్మిస్తోన్న సినిమా కాబట్టి ప్రచారం కూడా బాగా వస్తుంది. నిజానికి ఈ సినిమాను గల్లా అశోక్‌తో చేద్దామనుకున్నారు. కానీ, కొత్త హీరో కన్నా ప్రేక్షకులకు తెలిసిన హీరో అయితే బెటర్ అని రాజ్ తరుణ్‌ను ఎంపిక చేసుకున్నారు. రాజ్ తరుణ్‌తో ఇప్పటికే దిల్ రాజు ‘లవర్’ సినిమాను నిర్మించారు.