Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Raja Meeru Keka Telugu Movie Review
బ్యానర్: ఆర్.కె.స్టూడియోస్
నటీనటులు : రేవంత్, నోయల్, హేమంత్, లాస్య, శోభిత, నందమూరి తారకరత్న
దర్శకత్వం : కృష్ణ కిషోర్
నిర్మాత : రాజ్ కుమార్
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ చరణ్
“రాజా మీరు కేక”… ఈ సినిమా టైటిల్ వినగానే ఇంటరెస్టింగ్ గా అనిపిస్తుంది. పైగా బుల్లితెర, ఎఫ్.ఎం రేడియోల్లో బాగా పరిచయమున్న హేమంత్, నోయెల్, లాస్య తో పాటు రేవంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నందమూరి తారకరత్న విలన్ గా చేయడంతో ఇంకాస్త క్రేజ్ కనిపించింది. చిన్న సినిమా, కొత్త దర్శకుడు అయినా మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టు వుందో, లేదో ఇప్పుడు చూద్దాం.
కథ..
ట్రూ టెక్ కంపెనీలో రవి, శశాంక్, శ్వేతా, శ్రీను సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పని చేస్తుంటారు. ఆ కంపెనీ యాజమాని నాగ రాజుకి డబ్బంటే మోజు. 1000 కోట్ల విలువైన కంపెనీతో సంతృప్తి పడకుండా ఇంకా డబ్బు సంపాదించాలన్న యావతో సీఎం తో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి దిగుతాడు. ఇందుకోసం ట్రూ టెక్ కంపెనీ నిధుల్ని వాడుకుంటాడు. దీంతో ట్రూ టెక్ కంపెనీ పతనావస్థకు చేరుకుంటుంది. అందులో పనిచేసే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎంతోమంది ఇబ్బందులు పడతారు. శ్వేతా, రవి ఉద్యోగాలు కోల్పోతారు. రవి తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోతాడు. శ్వేతా కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన వాళ్ళు ఏమి చేశారు… అసలు తప్పెవరిది… చివరకు ఏమవుతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానమే రాజా మీరు కేక.
విశ్లేషణ..
ఈ సినిమా కధ చూస్తుంటే సత్యం కంప్యూటర్స్ నాటి ఘటనలు గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం కూడా ఐటీ రంగంలో ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితులకు తగ్గ కధే. అయినా కధనంలో కొత్త దర్శకుడు టి.కృష్ణ కిషోర్ ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే బాగుండేది. కృష్ణ కిషోర్ లోని దర్శకుడిని రచయిత డామినేట్ చేసాడు. సీన్ లో ఇంటెన్సిటీ కన్నా డైలాగు లో భావోద్వేగాలు పలికాయి. అయితే కథా గమనం ఊహించే రీతిలో ఉండటంతో ప్రేక్షకుడు పెద్దగా ఎగ్జైట్ అయ్యే సీన్స్ లేకుండా పోయాయి. అయితే సినిమాని ఒక్క మాటతో బాగా లేదని చెప్పలేము. బాగా చదివే కుర్రోడు కి ఇంకాస్త మార్కులు వస్తే బాగుండు అనుకున్నట్టే ఈ సినిమాని ఇంకా బాగా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. గట్టి ప్రయత్నం చేస్తే దర్శకుడికి మంచి భవిష్యత్ ఉంటుంది.
నటీనటులు అందరూ బాగా చేశారు. టీవీ రంగంలో పరిచయమైన లాస్య, నోయెల్ తో పాటు హేమంత్, రేవంత్ కూడా తమ స్క్రీన్ ప్రెజన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక తారకరత్న విలన్ గా ఇంకోసారి అదరగొట్టాడు. పోసాని ట్రేడ్ మార్క్ గురించి చెప్పక్కర్లేదు.
టెక్నికల్ విభాగానికి వస్తే ఎడిటింగ్ లో లోపాలు కనిపిస్తున్నాయి. ఇంకాస్త బాగా చేసి ఉంటే సినిమా రేంజ్ పెరిగేది.మ్యూజిక్ దర్శకుడు శ్రీ చరణ్ పర్లేదనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక పాటల విషయానికి వస్తే అంతగా రిజిస్టర్ కావు. కెమెరా మెన్ రామ్ రెడ్డి పనితనం బాగుంది.
తెలుగుబుల్లెట్ పంచ్ లైన్.. “రాజా మీరు కేక “అని మనం చెప్పుకోకూడదు.
తెలుగు బులెట్ రేటింగ్… 2 .75 /5 .