Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని అవార్డుల ఫంక్షన్ హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా సాగింది. అందులో పాల్గొన్న వాళ్ళు ఒకరి మీద ఒకరు ఎంతగా పొగడ్తలు కురిపించుకున్నారో సభకి వెళ్లన వాళ్ళు, టీవీల ముందు కూర్చున్నవాళ్ళకి బాగానే అర్ధం అయ్యింది. అంటే సభ గ్రాండ్ సక్సెస్ అయినట్టేగా అనుకోవడం సహజం. కానీ ఇదే సభకి వెళ్లివచ్చిన ఓ సీనియర్ జర్నలిస్ట్ ని ఇదే విషయం గురించి అడిగితే పెదవి విరిచారు. అదేంటని అడిగితే అవార్డుల సభ అనగానే కేవలం పొగడ్తలు మాత్రమే కొద్దిపాటి విరుపులు, చమక్కులు, చమత్కారాలు కూడా కావాలని చెప్పారు. ఈ విషయం చెబుతూనే ఆయన గతంలోకి వెళ్లిపోయారు. ఆ ఫ్లాష్ బ్యాక్ విశేషాలు మీకోసం…
గతంలో హైదరాబాద్ లో సినిమా లేదా సాంస్కృతిక సంబంధమైన సభ ఏదైనా హైదరాబాద్ లో జరిగితే అందులో కచ్చితంగా ఐదుగురు పాల్గొనేవాళ్ళు. ఆ ఐదుగురు ఎవరంటే ఏబీసీడీ అండ్ రాజకుమారి. ఏబీసీడీ ఎవరా అని ఆశ్చర్యపోకండి. ఏ అంటే అక్కినేని నాగేశ్వరరావు, బి అంటే సభా సామ్రాట్ భాస్కరరావు, సి అంటే సి.నారాయణరెడ్డి, డి అంటే దైవజ్ఞ శర్మ. వీరితో పాటు నన్నపనేని రాజకుమారి. ఈ ఐదుగురు పాల్గొనే సభ భలే రక్తి కట్టేదట. ఈ సభల్లో పాల్గొనే అక్కినేని, సినారె వేసే జోకులు, కథానాయికల మీద వేసే విసుర్లు అందర్నీ కడుపుబ్బా నవ్వించేవి. వాళ్ళ చెప్పే అనుభవాలు పాఠంలా ఉపయోగపడేవి. ఇక నన్నపనేని రాజకుమారి సైతం ఆ ఇద్దరు సీనియర్స్ కి దీటుగా సమాధానం చెప్పేవాళ్ళు. ఇక పొగడ్తలు, ఉపమానాలతో సభకి అధ్యక్షత వహించే భాస్కరరావు ఎక్స్ ప్రెస్ రైలులా తన భాష పాటవంతో దూసుకుపోతుంటే అదో కిక్. ఇక దైవజ్ఞ శర్మ ఎక్కడ సెలబ్రిటీ లు ఉంటే అక్కడ చేరి ఫొటోల్లో కనిపించడం కోసం చేసే హడావిడి ఆహూతులకు ఓ సరదా ఎపిసోడ్. ఈ ఐదుగురు పాల్గొనే సభలు అంతలా ఆలరించేవని ఆ సీనియర్ జర్నలిస్ట్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు జరిగిన అక్కినేని అవార్డుల సభ ఓ కార్పొరేట్ వ్యవహారంలా నడిచిందని సదరు జర్నలిస్ట్ అన్న మాట. ఇందులో నిజానిజాలు, తప్పొప్పులు వెదకడం పక్కనబెట్టి దాన్ని ఓ అభిప్రాయంగా తీసుకుంటే చాలు.
ఆ జర్నలిస్ట్ చెప్పిన ఏబీసీడీ ల్లో ఇప్పుడు ఏ, సి చనిపోయారు. ఆ ఇద్దరితో పాటు పూలకి దారంలా కలిసి వచ్చే భాస్కరరావు, దైవజ్ఞ శర్మని ఇప్పుడు ఎవరూ సభలకి పిలవడం లేదు. ఇక ఇదో వ్యక్తి నన్నపనేని రాజకుమారి రాష్ట్ర విభజన పుణ్యమా అని ఎక్కువగా గుంటూరు లోనే వుంటున్నారు. దీంతో ఆమె కూడా ఈ మధ్య హైదరాబాద్ సభల్లో పెద్దగా కనిపించడం లేదు.