Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాహుబలి 2 ఎన్ని రికార్డులు సృష్టించిందో లెక్కలేదు. జాతీయస్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటటమే కాదు..అంతర్జాతీయంగానూ ప్రశంసలు దక్కించుకుంది. కానీ ఎప్పటిలానే దక్షిణాది సినిమాలపై వివక్ష చూపుతూ ఆస్కార్ అవార్డులకు చిత్రాలను ఎంపిక చేసే జ్యూరీ బాహుబలిని పక్కనబెట్టి న్యూటన్ అనే ఊరూ పేరు తెలియని సినిమాను ఎంపిక చేసింది. న్యూటన్ సినిమా కథాంశం కొత్తదే అయినా…సినిమాను తీసిన విధానం కూడా బాగుందని పేరు తెచ్చుకున్నా…బాహుబలిని కాదని మరీ ఆస్కార్ అవార్డుకు ఆ సినిమాను ఎంపికచేయడంపై జాతీయ మీడియాలో సైతం విమర్శలు వచ్చాయి. ఇక సోషల్ మీడియా అయితే దీనిపై తీవ్రంగా స్పందించింది. కానీ బాహుబలి డైరెక్టర్ రాజమౌళి మాత్రం ఈ విషయాన్ని పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. తన సినిమాకు అవార్డులు రావడం ముఖ్యం కాదన్నారు రాజమౌళి.
తన సినిమా అభిమానులకు నచ్చడంతో పాటు, నిర్మాతలకు నాలుగు డబ్బులు తెచ్చిపెడితే చాలని వ్యాఖ్యానించారు. సినిమా కథపై తాను సంతృప్తి చెందిన తరువాతే తెరకెక్కిస్తానని, అధి సాధ్యమైనంత ఎక్కువమంది ప్రేక్షకులకు చేరేలా చూడటమే తన లక్ష్యమని దర్శక ధీరుడు అన్నారు. బాహుబలి ఆస్కార్ కు నామినేట్ కాకపోవడంపై తనకు ఎలాంటి అసంతృప్తీ లేదని స్పష్టంచేశారు. సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడూ అసంతృప్తిని కానీ, ఆగ్రహాన్ని కానీ బహిరంగంగా వ్యక్తంచేయని రాజమౌళి తనకు అలవాటైన పద్ధతిలోనే ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు కానీ…దక్షిణాది సినీ ప్రేక్షకులు మాత్రం ఆస్కార్ నామినేట్ జ్యూరీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.