Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ రాసిన డెమోక్రసీ ఎలెవన్ః ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ భారత క్రికెటర్ల గురించి ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తోంది. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన రాజ్ దీప్ ఈ పుస్తకం కోసం విస్తృత కసరత్తే చేశారు. పాత తరం క్రికెటర్ దిలీప్ సర్దేశాయ్ కొడుకైన రాజ్ దీప్ సర్దేశాయ్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ తో పాటు అనేక విషయాలను తన పుస్తకంలో చర్చించారు… అదే సమయంలో సమకాలీన క్రికెట్ లో హాట్ టాపిక్ అయిన కొన్ని సంగతులను ఆయన అసలు ప్రస్తావించలేదు. వాటిల్లో ఒకటి… ఐపీఎల్ లో స్పాట్ ఫిక్సింగ్. మేటిజట్లుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో రెండేళ్ల నిషేధానికి గురికావడానికి కారణం స్పాట్ ఫిక్సింగే.
దీని గురించి పుస్తకంలో ప్రస్తావించకపోవడానికి కారణం ధోనీ నోరుమెదపక పోవడం వల్లేనన్నారు రాజ్ దీప్. స్పాట్ ఫిక్సింగ్ గురించి తాను ధోనీని అడిగానని, అతను నోరుమెదపలేదని చెప్పారు. అలాగే కోహ్లీ, కుంబ్లే మధ్య విభేదాల గురించి ప్రస్తావించకపోవడానికి గల కారణమూ వాళ్లిద్దరూ దీనిపై మాట్లాడకపోవడమేనని చెప్పారు. వారిద్దరి మధ్య విభేదాల గురించి మొదట కోహ్లిని అడగ్గా… అతను ఏ సమాధానమూ ఇవ్వలేదని, కుంబ్లే మాత్రం ఇప్పుడు దాని సంగతి వదిలేయమన్నాడని రాజ్ దీప్ వెల్లడించారు.