రాజీవ్‌ రాజకీయ జీవితం..అత్యంత దారుణంగా ముగిసింది : సోనియా గాంధీ

Sonia Gandhi
Sonia Gandhi

మాజీ ప్రధాని దివంగత రాజీవ్‌ గాంధీ రాజకీయ జీవితం అత్యంత దారుణ రీతిలో ముగిసిందని ఆయన సతీమణి, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అన్నారు. 25వ రాజీవ్‌ గాంధీ నేషనల్‌ సద్భావన అవార్డు కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. అర్ధాంతరంగా ఆయన జీవితం ముగిసినా.. ఆయన పదవిలో ఉన్న కొద్ది కాలంలోనే ఎన్నో కీలక విజయాలను సాధించారని తెలిపారు.

రాజీవ్​.. మహిళా సాధికారతకు కృషి చేశారని.. పంచాయతీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పోరాటం చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు ఉన్నారంటే.. అందుకు రాజీవ్ కఠోర శ్రమ, దూరదృష్టే కారణమని సోనియా అన్నారు.

సమాజంలో.. విద్వేశం, విభజన, పక్షపాత రాజకీయాలు చురుగ్గా మారుతున్నాయని, వాటికి అధికార పక్షం నుంచి మద్దతు లభిస్తోందని సోనియా గాంధీ విమర్శించారు. అన్ని మతాలు, సంస్కృతులు, భాషలు, జాతుల సమాహారం వల్లే ఈ దేశ ఐక్యత బలోపేతం అవుతుందని రాజీవ్‌ భావించారని తెలిపారు.