Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమాఖ్య వ్యవస్థలో శాంతిభద్రతల అంశం రాష్ట్ర సర్కార్ పరిధిలోకి వస్తుంది. ఈ విషయం రాజ్యాంగం గురించి అవగాహన వున్న ఎవరికైనా తెలుసు. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయితే అప్పుడు గవర్నర్ ఇచ్చే నివేదిక ఆధారంగా అవసరం అనుకుంటే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అంటారా ? అక్కడికే వస్తున్నాం. తాము మంత్రిపదవులకు రాజీనామా చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు గాడి తప్పాయి అని భావిస్తున్న కమలనాధులు “ ఆపరేషన్ ద్రవిడ” లో భాగమే “ ఆపరేషన్ గరుడ “ అంటూ చేసిన ప్రకటన మీద ఢిల్లీ దాకా వెళ్లారు.ఈ పరిస్థితిని ముందే ఊహించిన శివాజీ తన ప్రకటనలో ఎక్కడా ఏ పార్టీ పేరు ఎత్తలేదు.అయినా మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇప్పటికే ఏపీ డీజీపీ ని కలిసి నిరాధార ఆరోపణలు చేసిన శివాజీ మీద చర్య తీసుకోవాలని కోరారు. ఆ మేరకు ఫిర్యాదు కూడా చేశారు. రాజకీయంగా తమకు నష్టం కలుగుతుంది అనుకుని అలా చేశారు అనుకుంటే ఓకే.
శివాజీ ప్రకటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద విస్తృత చర్చ సాగుతోంది. ప్రజల్లో భవిష్యత్ పరిణామాల మీద సునిశిత దృష్టి పడింది . అంతకుమించి ఏ శాంతిభద్రతల సమస్య ఏర్పడలేదు. కానీ మాణిక్యాలరావు గారు ఇక్కడ ఏదో జరిగిపోయినట్టు ఏకంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ని కలిసి నటుడు శివాజీ మీద ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా శివాజీ మీద కేంద్రం చర్యలు తీసుకుంటుందని ఎవరూ అనుకోరు. కానీ కేంద్రంలో వున్నది మోడీ సర్కార్. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు అన్న భయం మాత్రం సామాన్యులు మొదలుకుని రాజకీయ మేధావుల దాకా వుంది. అయినా కేంద్రానికి వ్యతిరేకంగా ఓ ప్రకటన లేదా ఆరోపణ చేస్తేనే ఇంత కఠిన పరిస్థితులు ఎదుర్కోవడం అంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి వున్నట్టే. కష్టం మన దాకా రాలేదని తమాషా చూస్తున్న వాళ్ళు రేపు ఇదే పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఎందుకంటే …కాల చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా!