మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యూచర్ రాజకీయాలేనా, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా సరే ఆయన రాజకీయ ప్రవేశం చేస్తాడా ? అనే అనుమాలను రేకెత్తించాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ మధ్య ఎవరూ జ్యూస్‌లు తాగడం లేదు. అందరూ టీ తాగుతున్నారు.’ అంటూ జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాస్ గురించి ప్రస్తావించారు. దీంతో కేటీఆర్ కూడా రామ్ చరణ్ మీద సెటైర్ వేశారు. చెర్రీ కామెంట్స్ బట్టి చూస్తుంటే భవిష్యత్ మీద పక్కా ప్లాన్‌తో ఉన్నట్టు కనిపిస్తోందన్నారు.
అయితే, అలాంటిదేం లేదంటూ రామ్ చరణ్ సర్ది చెప్పే ప్రయత్నం చేసి నవ్వుతుండగా.. ”అంటే ఇప్పుడే కాదు.. ఇంకా టైమ్ ఉంది” అని చెప్పగా.. రామ్ చరణ్ కేటీఆర్ ని చూసి దండం పెట్టేశాడు. ఆ పక్కనే ఉన్న చిరంజీవి.. ‘వాడి పని వాడిని చేసుకోని’ అని కేటీఆర్ తో నవ్వుతూ అన్నారు. ‘ఇప్పుడు కాదులే. భవిష్యత్తులో’ అంటూ కేటీఆర్ కవర్ చేశారు. రామ్ చరణ్ గతంలో నటించిన రంగస్థలం సినిమాలో ‘ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా?’ సాంగ్‌ను తన ఎన్నికల ప్రచారంలో వినియోగించుకున్నానని, ఆ సినిమాలాగే తన ప్రసంగాలు కూడా సక్సెస్ అయ్యి రాష్ట్రంలో ప్రజలు తమను గెలిపించారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్‌తో ఈ మధ్య రెండు సార్లు మాట్లాడానని చెప్పారు కేటీఆర్. పవన్ కళ్యాణ్ సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం కూడా కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.