మళ్లీ 10 లక్షలు ప్రకటించిన వర్మ

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా అందరు పిలిచే రామ్‌ గోపాల్‌ వర్మ తెలుగు రాష్ట్రాలను కుదిపేసేందుకు ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఎన్టీఆర్‌కు సంబంధించిన అసలు చరిత్రను తాను తెరకెక్కిస్తానంటూ వర్మ ప్రకటించాడు. ఎన్టీఆర్‌ నుండి చంద్రబాబు నాయుడు ఎలా అధికారాన్ని దక్కించుకున్నాడు అనే విషయాన్ని తన సినిమాలో ప్రముఖంగా చూపిస్తాను అంటూ ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవలే అచ్చు చంద్రబాబు నాయుడులా ఉన్న ఒక వ్యక్తిని పట్టుకున్న వర్మ ఇప్పుడు ఎన్టీఆర్‌ పాత్ర కోసం నటుడిని పట్టుకునేందుకు సిద్దం అవుతున్నాడు.

ఒక హోటల్‌లో వెయిటర్‌గా పని చేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు పాత్ర కోసం తీసుకున్నాడు. ఆ వ్యక్తిని తీసుకు వచ్చినందుకు లక్ష రూపాయల బహుమానంను వర్మ ప్రకటించాడు. ఇప్పుడు వర్మ పదిలక్షల బహుమానంను ప్రకటించాడు. అచ్చు ఎన్టీఆర్‌ల ఉన్న వ్యక్తిని నా ముందుకు తీసుకు వచ్చినా లేదంటే కనీసం ఫొటోలు పంపించినా కూడా మీకు 10 లక్షల రూపాయల బహుమానం ఇస్తాను అంటూ వర్మ ప్రకటించాడు. సోషల్‌ మీడియా ద్వారా వర్మ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. త్వరలోనే వర్మకు ఎన్టీఆర్‌ డూప్‌ కూడా దొరికే ఛాన్స్‌ ఉందని అంతా భావిస్తున్నారు.