Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాచాటిన బాహుబలిలో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్రకు మొదట అతిలోక సుందరి శ్రీదేవిని అనుకున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక చిత్రంలో భాగం కావాల్సిందిగా దర్శకనిర్మాతలు శ్రీదేవిని సంప్రదించగా… అందులో నటించేందుకు… ఆమె పెట్టిన కండిషన్స్ కు తాము విస్తుపోయామని దర్శకుడు రాజమౌళి చెప్పడం అప్పట్లో దుమారంగా మారింది. బాహుబలి 2 రిలీజ్ తర్వాత శ్రీదేవి తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ కూడా ఇచ్చారు. రెమ్యునరేషన్ విషయంలోగానీ… తాను బసచేసేందుకు ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ ఫ్లోర్ మొత్తం బుక్ చేయమన్నట్టు వచ్చిన వార్తల్లోగానీ నిజం లేదని… శ్రీదేవి తెలిపారు. రాజమౌళి తనపై దుష్ప్రచారం చేశారని శ్రీదేవి ఎదురుదాడికి దిగారు.
ఒకటి, రెండూ సందర్భాల్లో ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన శ్రీదేవి తర్వాత ఎప్పుడూ దీని గురించి స్పందించలేదు. అటు రాజమౌళి కూడా తర్వాతెప్పుడూ దీని గురించి మాట్లాడలేదు. కానీ తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… బాహుబలిలో శ్రీదేవి నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. భర్త బోనీకపూర్ వైఖరి వల్లే శ్రీదేవి బాహుబలి ఆఫర్ వదులుకుందని వర్మ చెప్పారు. బాహుబలి కోసం రాజమౌళి శ్రీదేవిని సంప్రదించిన సమయంలో తాను కూడా ఆమెతో స్వయంగా మాట్లాడానని, గొప్ప సినిమా అని, అవకాశం వదులుకోవద్దని చెప్పానని గుర్తుచేసుకున్నారు. సినిమాలో చేయడానికి శ్రీదేవి కూడా ఆసక్తి చూపిందని, కానీ బోనీకి మాత్రం ఇష్టం లేదని, దీంతో రెమ్యునరేషన్ ను భారీగా డిమాండ్ చేసి, బాహుబలిలో శ్రీదేవి నటించకుండా చేశారని వర్మ విమర్శించారు. బాహుబలి ఒక్కటనేకాదని, బోనీకపూర్ నిర్ణయాల వల్ల కెరీర్ పరంగా చాలా సినిమాల విషయంలో శ్రీదేవి నష్టపోయారని చెప్పారు. తండ్రిని కోల్పోయిన తర్వాత శ్రీదేవి ఒక్కరోజు కూడా సంతోషంగా లేరని వర్మ ఆవేదన వ్యక్తంచేశారు.