Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రంజాన్ మాసం ముస్లింలకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సమయం. జీవితంలో రంజాన్ మాసం ఉన్నతమైన మార్పులు తీసుకొస్తుందని ముస్లింలు భావిస్తారు. రోజుకు ఐదుసార్లు ప్రార్థనల కోసం కూర్చోవడం ద్వారా మనసులో జరిగే అనేక మార్పులు ఒకే దృష్టికోణంలో ఆలోచించేలా చేస్తాయి. అలాగే రోజూ ఖురాన్ పఠించడం వల్ల ఒత్తిళ్లు దూరమై క్రమశిక్షణ అలవడుతుంది. జీవితకాలం శాశ్వతమైన మంచి మార్పులకు రంజాన్ మాసం దారితీస్తుంది. ముఖ్యంగా జీవితంలో చెడు, ప్రతికూల విషయాలను తొలగించుకోడానికి ఉపవాక్ష దీక్ష అయిన రోజాను ఆచరించడం ఎంతో ఉపయోగపడుతుంది. మీరు సన్మార్గులుగా మారడానికి మీకు పూర్వపు జాతులలానే మీకు కూడా ఉపవాసాన్ని తప్పనిసరిగా భావించడం జరిగింది అని ఉపవాసం గురించి ఖురాన్ తెలియజేస్తుంది. అయితే సంవత్సరం మొత్తం మీద కేవలం ఒక నెలరోజుల పాటు పగటివేళ ఆహార పానీయాలు మానివేసినంతమాత్రాన మనిషి పూర్తిగా సన్మార్గంలో ఉన్నట్టేనా అన్న వాదన వినిపిస్తుంటుంది. అయితే రోజా దీక్షల ముఖ్య ఉద్దేశం శరీరాన్ని, మనసును కూడా నియంత్రణలో ఉంచుకోవడం. ఉపవాసం అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా అన్నానికి, నీళ్లకు దూరంగా ఉండడం కాదు.
ఉపవాసంలో కడుపొక్కటే ఉపవసించడం కాదు. శరీరంలోని అన్ని అవయయాలూ ఉపవసించాలి. చెడు దృష్టితో చూడకూడదు. చెడు మాటలు వినకూడదు. చెడ్డ పనులు చేయకూడదు. చెడుకు సాయపడకూడదు. చెడు మార్గంలో నడవకూడదు. మనసులో ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలూ రానివ్వకూడదు. అసత్యాన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఎవరితోనూ తగాదా పడకూడదు. ఇతరులెవరైనా తగువుకు వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెబుతారు మహాప్రవక్త. సర్వాంగాలను ఉపవసించడమే ఉవవాసం అసలు ఉద్దేశం. నిరంతర దైవధ్యానం వల్ల ఇది సాధ్యమవుతుంది. ప్రార్థనల కన్నా కూడా ఉపవాసం ఎంతో మేలు కలిగిస్తుంది. ఉపవాసం ఉన్న ముస్లిం పక్కన ఎవరూ లేని ఏకాంత సమయంలో కూడా ఏమీ తినడు, పచ్చి మంచినీళ్లు కూడా తాగడు. ఎవరు చూడకపోయినా అనుక్షణం దైవం తనను గమనిస్తున్నాడనే భావనతో ఉంటాడు. నెలరోజులు ఉపవాసదీక్ష ఆచరించిన తర్వాత ప్రవర్తనలో చాలా మార్పులు వస్తాయి.
ఉపవాసం స్వీయనియంత్రణ నేర్పిస్తుంది. సహజంగా ఆకలితో ఉన్న మనిషికి అతి కోపం వస్తుంది. ఏదైనా తగాదా వచ్చే సందర్భం ఎదురయితే ఉద్రేకం ఇంకా పెరుగుతుంది. అలాంటి స్థితిలో కూడా సహనాన్ని, సంయమనాన్ని పాటించడం అలవాటవడంతో మిగిలిన కాలంలో కూడా అదే ప్రవర్తన కనబరిచే అవకాశం ఉంటుంది. అందుకే ఇస్లాం మత గురువులు రంజాన్ మాసాన్ని సంవత్సరంలో మిగిలిన 11 నెలల పాటు జీవితాన్ని ఎలా గడపాలో బోధించే శిక్షణాకాలమని చెబుతుంటారు. ఉపవాసం వల్ల ఆరోగ్యానికీ ఎన్నో లాభాలున్నాయి. శరీరంలోని మలినాలన్నీ దూరమై పరిశుభ్రమవుతుంది. ఉపవాసదీక్షలు ఆచరించిన వారు త్వరగా అనారోగ్యానికి గురికారు. ఈ మాసంలో ఏ కారణం వల్లయినా ఉపవాసం తప్పిపోతే…జీవితకాలమంతా ఉపవసించినా దాని విలువ తీరదు అంటారు మహ్మద్ ప్రవక్త. ఉపవాసికి రెండు విధాలయిన ఆనందాలు లభిస్తాయని, ఒకటి ఉపవాస దీక్ష విరమింపజేసే సందర్భంలో, మరొకటి అంతిమదినాన ప్రతిఫలంగా లభించే దైవదర్శనంలో అని చెబుతారు.