Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జగన్ పాదయాత్రకు సర్వం సిద్ధం చేసుకుంటున్న వేళ వైసీపీ రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి షాకిచ్చారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలకు నచ్చలేదని ఆమె చెప్పారు. తన నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరే మిగిలిఉన్న సమయంలో ఇలా అసెంబ్లీ బహిష్కరించుకుంటూ పోతే అభివృద్ధి ఎలా సాగుతుందని ఆమె ప్రశ్నించారు. రంపచోడవరంలో ఎక్కువగా ఉన్న ఎస్టీలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. దురదృష్టవశాత్తూ జగన్ తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా సభలో తనకు ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కార్యకర్తలతో చర్చించిన తరువాతే… పార్టీ మారాలన్న నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
అటు మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇడుపుల పాయలో జగన్ పాదయాత్ర ప్రారంభమయ్యే ఆరో తేదీనే వారంతా పార్టీ మారి జగన్ కు షాకివ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కర్నూలు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల నుంచి ఈ ఫిరాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది. జగన్ వైఖరితో వైసీపీ ఎమ్మెల్యేలు విసిగిపోయారని, అందువల్లే తమ పార్టీలోకి వస్తున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. అసెంబ్లీని బహిష్కరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ, ప్రతి ప్రాజెక్టు పైనా కోర్టును ఆశ్రయిస్తున్న జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పడానికంటే ముందుగానే… పార్టీ నేతలు బుద్ధి చెబుతున్నారని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు.