ఏ ముహూర్తాన ‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా రమ్యకృష్ణ ఎంపిక అయ్యిందో కాని ఒక్కసారిగా స్టార్‌డం పెరిగి పోయింది. బాహుబలి చిత్రంకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడపా దడపా కనిపించిన రమ్యకృష్ణ ఇప్పుడు వరుసగా అవకాశాలతో దూసుకు పోతుంది. బాహుబలి చిత్రం తర్వాత హీరోయిన్స్ కంటే కూడా అధికంగా ఈమె పారితోషికం తీసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కేవలం తెలుగులో కాకుండా తమిళనాట కూడా రమ్యకృష్ణ క్రేజ్ మామూలుగా లేదు. తాజాగా తెలుగులో శైలజ రెడ్డి అల్లుడు చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్న విషయం తెల్సిందే. రమ్యకృష్ణ టైటిల్ రోల్‌ను పోషిస్తున్న ఆ చిత్రం ఈ నెల చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అను ఎమాన్యూల్ స్థాయిలో రమ్యకృష్ణ పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే ఈమెకు మెగా ఛాన్స్ దక్కింది.
అప్పట్లో ఒక్కడుండేవాడు అంటూ ఒక విభిన్న చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ ఒక చిత్రాన్ని చేయబోతున్నాడు. వచ్చే నవంబర్‌లో ఈ చిత్రంకు క్లాప్ పడబోతుంది. ఇటీవలే స్క్రిప్ట్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా నటీనటుల ఎంపిక కార్యక్రమంను చేస్తున్నారు. హీరోయిన్ ఎంపిక దాదాపుగా పూర్తి అయ్యిందని, ఆమె నిర్ణయం తెలపడమే ఆలస్యం అంటూ దర్శకుడు సాగర్ చెబుతున్నాడు. ఇక ఈ చిత్రంలో ఒక కీలకమైన పాత్రలో రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లుగా ఆయన పేర్కొన్నాడు. బాహుబలిలో శివగామి పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తాను చేయబోతున్న సినిమాలో రమ్యకృష్ణ గారి పాత్ర అంతే పవర్ ఫుల్‌గా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి శైలజ రెడ్డికి మరో పవర్ ఫుల్ పాత్ర దక్కడంతో ఆమె స్థాయి మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.